రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్లకు ఇబ్బందులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్లకు ఇబ్బందులు

ఎక్కడో తప్పు జరిగింది కాబట్టే ఎఫ్సీఐ అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించి ధాన్యం సేకరణను 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కోటి 24 లక్షల మెట్రిక్ టన్నులకు కేంద్రం పెంచిందన్నారు. 2014 నుంచి 7 రెట్లు ప్రొక్రూర్మెంట్ ను పెంచిందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం పెరగలేదని.. వరి ధాన్యం పంటను పెంచారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని..వారి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 

రాష్ట్ర ప్రభుత్వం, కొంతమంది మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల సిస్టం మొత్తం నాశనమైందని అర్వింద్ అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది మధ్యవర్తిత్వం మాత్రమే అని.. కొనుగోలు డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని చెప్పారు. వరి ధాన్యం పెంచడం వల్ల పప్పులు, మిర్చి, పసుపు పండించే రైతులు తగ్గిపోయారన్నారు. కుటుంబ పరిపాలన వల్ల మొత్తం రాష్ట్రం ఆగమైతుందని..దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరణ చేపట్టాలి - రైస్ మిల్లర్లు

కేంద్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరణ చేపట్టాలని తెలంగాణ రైస్ మిల్లుల సంఘం జనరల్ సెక్రెటరీ మోహన్ రెడ్డి కోరారు. తమ సమస్యలపై ఎంపీ అర్వింద్ ను వారు కలిశారు. రాష్ట్రంలో 3400 రైస్ మిల్స్ ఉన్నాయని..63 మిల్లులలో అక్రమాలు జరిగాయని ఎఫ్సీఐ అధికారులు గుర్తించినట్లు వారు తెలిపారు. అక్రమాలు చేసే రైస్ మిల్లుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కొందరు చేసిన తప్పిదాల వల్ల 47 రోజుల నుంచి ప్రోక్రూర్ మెంట్ ఆగిపోయిందని..దీని వల్ల 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులలోనే ఉందన్నారు. రైస్ మిల్లులపై 30 లక్షల మంది ఆధారపడి ఉన్నారని..కేంద్రం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.