
న్యూఢిల్లీ, వెలుగు: ‘‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 27 మంది ఇంటర్ స్టూడెంట్లు చనిపోయారు. వారంతా భారతీయులు. వారి ఆత్మహత్యల అంశం పార్లమెంటులో లేవనెత్తడం ఎంపీలుగా మా బాధ్యత. స్టూడెంట్ల చావులకు కారణమైన వారిని శిక్షించకుండా సీఎం చోద్యం చూస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. చనిపోయిన స్టూడెంట్ల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు మా పార్టీ పోరాడుతుంది”అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. స్టూడెంట్ల ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ఎంపీలు కుటిల కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. స్టూడెంట్ల ఆత్మహత్యల అంశం రాష్ట్రానికి సంబంధించినదని, పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కోరడం సిగ్గుచేటని అన్నారు. గురువారం పార్లమెంటు వద్ద అర్వింద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన నామా నాగేశ్వర్ రావుతో కలిసి టీఆర్ఎస్ ఎంపీల బృందం స్పీకర్ ని కలవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోదామంటే ఫామ్‌హౌస్‌లో ఉండి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని అర్వింద్ ఆరోపించారు. బీజేపీని లైట్ తీసుకోవాలన్న కేసీఆర్ కామెంట్లపై అర్వింద్ ఫైరయ్యారు. ప్రపంచంలో అతి పెద్ద పార్టీ బీజేపీ అని, తమ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
చర్యలు తీసుకుంటే ఇంత వరకూ వచ్చేదా?
ఇంటర్ స్టూడెంట్ల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోని ఉంటే ఈ అంశం పార్లమెంటు వరకూ వచ్చేది కాదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనందు వల్లే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువచ్చామని చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే రాష్ట్ర అంశం అంటూ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తమపై పరువునష్టం దావా వేస్తామంటున్నారని, స్టూడెంట్ల ఆత్మహత్యలతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పరువును టీఆర్ఎస్ తీసిందని, దీనికి మేము ఎన్ని లక్షల కోట్ల పరువునష్టం దావా కేటీఆర్ మీద వేయాలని ప్రశ్నించారు.