ఇందూరు గడ్డపై సై అంటే సై

ఇందూరు గడ్డపై సై అంటే సై
  •    నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఎంపీ అభ్యర్థుల వాడీవేడీ కామెంట్స్  
  •     మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న  డైలాగ్ వార్‌‌ 
  •     ఓటర్లను తిరుకాసులో పెట్టేలా మైండ్​గేమ్​ 
  •     నేటి నుంచి  ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ 
  •     పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్ 
  •     సీఏఏ, ఎన్ ఆర్సీ అంశాలే ప్రధానాస్త్రంగా ఎంపీ ప్రచారం

నిజామాబాద్​, వెలుగు : నిజామాబాద్​ పార్లమెంట్​ సెగ్మెంట్​లో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచార స్పీడ్​ పెంచారు. గత నెల 16న  ఎన్నికల షెడ్యూల్​వెలువడ్డాక ప్రారంభమైన ప్రచారం ప్రస్తుతం జోరందుకుంది. పసుపు బోర్డు విషయంలో  బీజేపీ అభ్యర్థి అర్వింద్​ను డేట్​ ఎక్సపైరీ అయిన యువ నాయకుడని కాంగ్రెస్​ క్యాండిడేట్​ జీవన్​రెడ్డి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.  కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తూ  సీఏఏ, ఎన్​ఆర్సీ అంశాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళుతుంది.  

మరో పక్క బీఆర్‌‌ఎస్​ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​ ఇద్దరిపై విమర్శల బాణాలు వదులుతున్నారు.  ఈ నెల 18 నుంచి 25  దాకా నామినేషన్లు దాఖలు చేసే టైంలో వచ్చినందున ముగ్గురూ హుషారు వాతావరణం క్రియేట్​ చేస్తున్నారు.  క్యాడర్​లో జోష్​ పెంచే ప్రయత్నం చేస్తూ ఓటర్లను తికమక  చేసే మైండ్​గేమ్​కు ప్రయారిటీ ఇస్తున్నారు.  ఛాయ్​పే చర్చ.. సభలు, సమావేశాలతో తన ఎన్నికల ప్రత్యర్థులెవరో అఫీషియల్​గా తేలకముందే సిట్టింగ్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ మార్చి మొదటివారంలోనే ఎన్నికల ప్రచారం స్టార్ట్​ చేశారు.  

టికెట్​ ధీమాతో ముందుకు సాగగా హైకమాండ్​ ఆయన పేరును ఫస్ట్​ లిస్టులో ప్రకటించింది.  మొదట్లో కాషాయదండు,  కుల సంఘాలతో నాలుగైదు మీటింగ్​లకు పరిమితమై ఇప్పుడు 20 కి తగ్గకుండా ప్రోగ్రాం ఫిక్స్​ చేసుకున్నారు.  

బీజేపీ నేతల జోరు ప్రచారం

ఓటర్లను కలవడానికి ఛాయ్​ పే చర్చ నిర్వహిస్తున్నారు.  టిఫిన్​,  భోజన్ భైటక్​ పేరుతో కార్యకర్తలను కలుస్తూ గ్రౌండ్​ పరిస్థితి సేకరిస్తున్నారు. కేంద్ర మంత్రులను ప్రచారం కోసం రప్పించే ప్లాన్​ చేస్తున్నారు.  ఇవన్నీ ఒకెత్తుకాగా ప్రత్యర్థులను ఢీలా చేయడానికి సీఏఏ, ఎన్​ఆర్సీ అంశాలను తన స్పీచ్​లో తప్పక ఉండేలా చూసుకుంటున్నారు. వీటిని వ్యతిరేకించే వారు దేశద్రోహులని,  జైళ్లకు పంపుతామని వాయిస్​ పెంచారు.

సీఏఏకు వ్యతిరేకంగా  కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​రెడ్డి ఆందోళన చేశారని తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నారు. ఆరుగ్యారెంటీలు అమలు చేశాకే  ప్రజలను కాంగ్రెస్​ ఓట్లు అడగాలని ప్రచారం చేస్తున్న ఆయన సీఎం రేవంత్​రెడ్డి బీజేపీలోకి వస్తే మిత్రుడిగా వెల్​కమ్​ చెబుతానని జగిత్యాలలో సంచలన కామెంట్​ చేశారు.  

పసుపు బోర్డు చుట్టూ రాజకీయాలు 

2019 ఎలక్షన్​లో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తానని బాండ్​ పేపర్​ రాసిచ్చి అమలు చేయలేని అర్వింద్​ డేట్​ ఎక్స్​పైర్ అయిన నాయకుడని ఆయనకు ఓటేస్తే ఉపయోగమేమీలేదని జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.  ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్​గా , సుదీర్ఘకాలం కాంగ్రెస్​ లీడర్​గా పనిచేసిన డి.శ్రీనివాస్​ కొడుకు అర్వింద్​ రక్తంలో కాంగ్రెస్​ డీఎన్​ఏ ఉందని సెటైర్లు వేస్తున్నారు.  రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ఆలోచన సెక్యూలర్​ స్ఫూర్తికి విరుద్ధమని ప్రస్తావిస్తున్నారు.  స్పష్టమైన ఉర్దూ, హిందీ, తెలుగు భాషలను మాట్లాడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు.  

బీఆర్​ఎస్​ పార్టీ పనైపోయిందని బాజిరెడ్డి గోవర్ధన్​ పోటీ నుంచి తప్పుకుంటే ఆయనకు కనీసం గౌరవం మిగులుతుందని తన మరో ప్రత్యర్థికి చురకలంటిస్తున్నారు.  ధీటైన అభ్యర్థి సెలెక్షన్​ కోసం హైకమాండ్​ టైం ఎక్కువ తీసుకొని తను పేరును ప్రకటించాక జీవన్​రెడ్డి పార్లమెంట్​ సెగ్మెంట్​ను చుట్టేస్తున్నారు. పార్లమెంట్​ సెగ్మెంట్​ ఎన్నికల ఇన్​చార్జ్​ మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి  అన్నీతానై ప్రచారం ప్లాన్​ రూపొందించారు. మండలాల వారీగా  కార్యకర్తలు, కుల సంఘాలతో మీటింగ్‌లు ముగించారు. ఇక రానున్న  రోజుల్లో వీలైనన్నీ ఎక్కువ గ్రామాలకు వెళ్లేలా షెడ్యూల్​ సిద్ధం చేశారు.  

బాజిరెడ్డి కూడా జోరుగానే.. 

బీఆర్​ఎస్​ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​ తన ఇద్దరు ఎన్నికల ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా కామెంట్లు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.  బీజేపీ అభ్యర్థి అర్వింద్​ పసుపు బోర్డు ప్రకటన బూటకమని ప్రధాని హోదాలో మోదీ ఇందూరు గడ్డపై ఇచ్చిన హామీ ఆరునెలలు దాటినా అడ్రస్​లేకపోవడం  ఆలోచించాలని ఓటర్లను కోరుతూ ప్రచారం చేస్తున్నారు. అర్వింద్​ తండ్రి డి.శ్రీనివాస్​ను 2014 ఎన్నికల్లో రూరల్​ నియోజకవర్గంలో

ఓడించిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్​, బాన్స్​వాడ, రూరల్​ సెగ్మెంట్​లలో తనలా ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఎవరికీలేదని స్పీచ్​లు ఇస్తున్నారు. పార్లమెంట్​లో తెలంగాణ గళం వినిపించడానికి తనను గెలిపించాలని ముందుకు సాగుతుండగా మారిన పొలిటికల్​ పరిణామాల దృష్ట్యా ఆయనకు పెద్ద స్పందన రావడంలేదు.