స్థానిక’ పోరుకు యంత్రాంగం రెడీ .. పోలింగ్ స్టాఫ్ కేటాయింపుల సమీక్ష

స్థానిక’ పోరుకు యంత్రాంగం రెడీ .. పోలింగ్ స్టాఫ్ కేటాయింపుల సమీక్ష
  • ఎన్నికల సామగ్రి ఇప్పటికే సిద్ధం
  • రిజర్వేషన్లపై ఉత్కంఠ

నిజామాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం రెడీ అవుతోంది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో అధికారులు గ్రౌండ్ వర్క్​ ప్రారంభించారు. ఎలక్షన్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్​లో భద్రపర్చగా పోలింగ్ స్టాఫ్ ఎంపికను సమీక్షిస్తున్నారు. కొత్త ఓటర్​ లిస్టుపై దృష్టి పెట్టారు. సీఈసీ నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 

అందరి దృష్టి రిజర్వేషన్లపైనే..

కొత్తగా పెరిగిన 15 గ్రామ పంచాయతీలు కలిపి జిల్లాలో 545 పంచాయతీలు, 5,022 వార్డులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని భావించి యంత్రాంగం 5,033 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రతి సెంటర్​కు పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్​తో పాటు స్టేజ్​-1, స్టేజ్​-2 యంత్రాంగాన్ని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చారు. నామినేషన్ పేపర్స్ మొదలుకొని 15 సింబల్స్​తో కూడిన 9 లక్షల సర్పంచ్ బ్యాలెట్ పేపర్స్,​ వార్డు సభ్యుల కోసం 9 లక్షల బ్యాలెట్ పేపర్స్​ ప్రింటింగ్ చేయించారు. 

పోలింగ్ బాక్స్​లతో సహా రెడీ కాగా, రిజర్వేషన్ల వ్యవహారాన్ని ఫైనల్ చేయాలని సర్కార్​ భావించింది. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డట్లయ్యింది. సామగ్రినంతా స్ట్రాంగ్ రూమ్​లో భద్రపరిచారు. తాజాగా హైకోర్టు ఆదేశాలు,  రాష్ట్ర సర్కార్​ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయింపుతో కదలిక మొదలైంది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కోసం పొలిటికల్ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందోనన్న టెన్షన్ ఆశావహుల్లో ఉండగా, యంత్రాంగం మాత్రం సీరియస్​గా తమ పని చేసుకుంటోంది.

స్టాఫ్ వివరాల సమీక్ష..

ఇది వరకే ప్రకటించిన ముసాయిదా లిస్టు ప్రకారం జిల్లాలో విలేజ్ ఓటర్ల సంఖ్య 8,51,770 మంది ఉన్నారు.  మహిళా ఓటర్లు 4,54,613 మంది, పురుషులు 3,97,140 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు. 18 ఏండ్లు నిండిన కొత్త ఓటర్ల చేర్పులు కొనసాగుతుంది. కొత్తగా సుమారు 25 వేల ఓట్లు పెరుగుతాయని అంచనా.  ఎన్నికల నిర్వహణకు ఎంపికైన స్టాఫ్​లో రిటైర్, ట్రాన్స్​ఫర్, ప్రమోషన్స్ పొందిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని సెలెక్ట్​ చేయనున్నారు. మొత్తం 6 వేల మంది స్టాఫ్ అవసరమని అధికారులు గుర్తించారు. స్ట్రాంగ్​రూమ్​లో భద్రపర్చిన పోలింగ్ సామగ్రి వివరాలు క్రాస్
 చెక్ చేస్తున్నారు.