
- నిజామాబాద్ జిల్లాలో బైక్ అదుపుతప్పి మామ, కోడలు..
వనపర్తి, వెలుగు : ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా నాచహళ్లి సమీపంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నాచహళ్లి గ్రామానికి చెందిన రవి(35) పెబ్బేరులో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు.
బుధవారం తన భార్య సరోజ, వనపర్తిలోని పీర్లగుట్టకు చెందిన రాజు (40)తో కలిసి ఆటోలో పెబ్బేరుకు వెళ్తున్నాడు. నాచహళ్లి దాటిన తర్వాత పెబ్బేరు నుంచి వనపర్తి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న రవి, రాజు అక్కడికక్కడే చనిపోగా.. సరోజకు స్వల్ప గాయాలు అయ్యాయి.
బైక్ అదుపు తప్పడంతో...
నందిపేట, వెలుగు : బైక్ అదుపుతప్పి కింద పడడంతో మామ, కోడలు చనిపోగా కొడుకుకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన నీరడి చింటుకు పూజ (26)తో ఎనిమిది నెలల కింద పెండ్లి అయింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల టైంలో చింటు తన భార్య పూజ, తండ్రి నారాయణ (55)తో కలిసి బైక్‌పై నిజామాబాద్‌కు వస్తున్నాడు.
మాక్లూర్ మండలం దుర్గానగర్ తండా సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పడంతో ముగ్గూరు కిందపడ్డారు. నారాయణ స్పాట్‌లోనే చనిపోగా.. పూజ, చింటుకు గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ పూజ చనిపోయింది.