- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
బోధన్, వెలుగు : నల్గొండ తరువాత రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం 23.26 కోట్ల నిధులను కేటాయించిందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ కాన్ఫరెన్స్ హాల్ లో వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. బోధన్సెగ్మెంట్ పరిధిలోని 3703 సంఘాలకు వడ్డీ లేని రుణాలకు రూ. 4.28 కోట్లు సభ్యుల ఖాతాల్లో జమయ్యాయన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. మహిళల అభ్యున్నతికి సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, యూనిఫాంల స్టిచింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు వంటివి మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. మహిళా సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చుకోవాలన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో రూ. 67కోట్ల రుణాలు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విఠల్, ఐకేపీ డీపీఎం రాచయ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
