వాడివేడిగా మెదక్​ జడ్పీసర్వసభ్య సమావేశం

వాడివేడిగా మెదక్​ జడ్పీసర్వసభ్య సమావేశం

మెదక్​, వెలుగు:  మెదక్ జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్​లో విద్య, వైద్యంపై వాడివేడి చర్చ జరిగింది. చైర్​ పర్సన్​ ర్యాకల హేమలత అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ఈ సమావేశంలో సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. ప్రభుత్వాసుపత్రుల్లో వివిధ సమస్యలున్నప్పటికీ సలహా కమిటీ మీటింగులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ‘మన ఊరు మన బడి’ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని డీఈవోను ఎమ్మెల్సీ  నిలదీశారు. జెడ్పీ మీటింగ్​కు కలెక్టర్​ రాకపోవడాన్ని నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు విజయ్​ కుమార్​తప్పుపట్టారు. కలెక్టర్​ రాలేనప్పుడు మీటింగులు పెట్టి ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్​ చీఫ్​ సెక్రటరీ మీటింగ్​లో ఉండడం వల్లే రాలేకపోయారని జడ్పీ సీఈవో వెంకట శైలేష్​ చెప్పారు. 

స్కానింగ్​, టెస్టులు బయిటికి రాస్తున్రు.. 

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, గడిచిన​ మూడేళ్లలో  ఆసుపత్రి సలహా కమిటీ మీటింగ్ ఒక్కసారి కూడా ఎందుకు పెట్టలేదని నిజాంపేట జెడ్పీటీసీ విజయ్​ కుమార్ ప్రశ్నించారు. కోవిడ్​ కారణంగా మీటింగ్​ పెట్టలేకపోయామని సూపరింటెండెంట్​ చంద్రశేఖర్ చెప్పారు. కమిటీ లేకున్నాజెడ్పీ చైర్​ పర్సన్​, ఎమ్మెల్యేలతో చర్చించి అవసరమైన పనులు చేస్తున్నామన్నారు. హాస్పిటల్​లో ఎన్ని డాక్టర్​ పోస్టులున్నాయి? అందులో రెగ్యులర్​ డాక్టర్లు ఎందరు? కాంట్రాక్ట్​డాక్టర్లు ఎందరు? ఎందరు డ్యూటీకి వస్తున్నారని అడిగితే ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని విజయ్​ కుమార్ ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ కింద ఎన్నినిధులు వచ్చాయో, వాటిని ఎందుకు వినియోగించారో ఎందుకు చెప్పడం లేదన్నారు. స్కానింగ్​, టెస్ట్ లకు బయటకు రాయడం వల్ల పేదలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. రెగ్యులర్​ రేడియాలజిస్ట్​లు లేక పోవడం వల్ల స్కానింగ్​లకు ఇబ్బంది ఉందని డీసీహెచ్​ చెప్పారు.  మెదక్, నర్సాపూర్​, తూప్రాన్​ హాస్పిటల్​లలో రేడియాలజిస్టుల నియమాకం కోసం వైద్య విధాన పరిషత్ కమిషనర్​కు లేఖ రాశామని చెప్పారు. ఎంపీపీలంతా పీహెచ్​సీ ఆసుపత్రి సలహా కమిటీ చైర్​పర్సన్​లు అయినప్పటికీ వైద్యారోగ్యశాఖ లెక్కచేస్తలేదని, ఏ మీటింగ్​ పెట్టినా పిలవడం లేదని నార్సింగి ఎంపీపీ సబిత ఫైర్​ అయ్యారు. నార్సింగి పీహెచ్​సీలో రెండేళ్లుగా నార్మల్​ డెలివరీలు కావడంలేదని, డాక్టర్​ వెళ్లిపోయి నెలరోజులైనా తమకు సమాచారం లేదన్నారు. చేగుంట ఎంపీపీ శ్రీనివాస్​ మాట్లాడుతూ డీఎంహెచ్​ఓ ఎంపీపీలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీపీల ఆధ్వర్యంలో ఒక్క మీటింగ్​ అయినా పెట్టారా అని డీఎంహెచ్​ఓను మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి ప్రశ్నించారు. ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి మీటింగ్​ పెట్టాలని డాక్టర్లకు ఆదేశాలిస్తామని డీఎంహెచ్​ఓ హామీ ఇచ్చారు. 

అక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తున్రు

మహిళా సంఘాల పైసలు పక్కదారి పడ్తోంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ చంద్రాగౌడ్​, నిజాంపేట జెడ్పీటీసీ విజయ్​ కుమార్​ ప్రశ్నించారు. నిజాంపేట మండలంలోని మూడు గ్రామాల్లో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, శివ్వంపేట మండలం గోమారంలో రూ.2.20 లక్షలను రికవరీ చేయకపోగా, గ్రామం మొత్తాన్ని బ్లాక్​ లిస్ట్​లో పెట్టడం ఎంత వరకు సమంజసమని చంద్రాగౌడ్​ ప్రశ్నించారు. దీనిపై డీఆర్​డీఓ శ్రీనివాస్ స్పందిస్తూ నందిగామ స్కాంలో సీసీని సస్పెండ్​ చేశామని, వీవోఏను తొలగించడంతో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. గోమారంలో కొంత మొత్తం రికవరీ చేయడంతోపాటు, వీవో లీడర్, సీసీలపై చర్యలు తీసుకున్నామన్నారు. రైతుబీమాకు సంబంధించి 121 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, ఇంటి పేరు, పేరు, వయసు, ఆధార్​ నెంబర్​ తప్పులు సరిచేసి బాధితకుటుంబాలకు త్వరగా బీమా పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీసర్లను ఆదేశించారు. సమావేశంలో నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి, అడిషనల్ కలెక్టర్​ రమేశ్​ 
పాల్గొన్నారు. 

జిల్లాలో మన ఊరు మన బడి పథకం పనులు చాలా డిలే అవుతున్నాయని ఎమ్మెల్సీ సుభాష్​ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై సమీపించిందని, పనులు ఇంకెప్పుడు చేస్తారని డీఈవో రమేశ్​​ను ప్రశ్నించారు.  కొల్చారం మండలంలో 16 స్కూల్ లను సెలెక్ట్​ చేయగా ఇంత వరకు ఒక్క పని స్టార్ట్​ కాలేదని జడ్పీటీసీ మేఘమాల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై డీఈఓ రమేష్​ స్పందిస్తూ మెదక్, హవేలి ఘనపూర్​, పాపన్నపేట, కొల్చారం మండలాల్లో పనులు డిలే అవుతున్నమాట వాస్తవమేనని, వేరే ఏజెన్సీలతో పనులు చేయిస్తామన్నారు.