నిజాంసాగర్కు పర్యాటక శోభ..స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద రూ. 9.98 కోట్లు మంజూరు

నిజాంసాగర్కు పర్యాటక శోభ..స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద రూ. 9.98 కోట్లు మంజూరు
  • పర్యాటకులను ఆకట్టుకునేలా పలు పనుల నిర్వహణ 
  • ఆహ్లాదకర పార్కులు, యోగ, స్పా సెంటర్, రెస్టారెంట్,  రూమ్స్ నిర్మాణం 

కామారెడ్డి, వెలుగు : నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్ ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేట్టింది. ఇటీవల స్వదేశీ​ దర్శన్​ 2 స్కీమ్​లో భాగంగా రూ.9.98 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్ట్​పరిసరాలు పర్యాటకులను ఆకట్టుకునేలా పనులు చేపట్టనున్నారు.  ప్రాజెక్ట్​ నిండి గేట్లు ఎత్తినప్పుడు వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా పార్కులు, యోగ, స్పా సెంటర్, రెస్టారెంట్,  రూమ్స్ వంటివి నిర్మించనున్నారు. రాష్ర్ట ప్రభుత్వం పర్యాటక కేంద్రాల అభివృద్ధికి 5 ఏండ్ల ప్రణాళికనూ రూపొందిస్తుంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్​కు అనుసంధానంగా మరిన్ని టూరిజం ప్రదేశాలను జిల్లాలో అభివృద్ధి చేయనున్నది. 

పర్యాటకులు సేద తీరేందుకు..​  

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ హైదరబాద్​కు 150 కిలో మీటర్లు, కామారెడ్డి జిల్లా కేంద్రానికి 60 కి.మీ. దూరంలో ఉంది.   వారాంతరాల్లో హైదరాబాద్ నుంచి పర్యాటకులు వస్తారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తే  స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. టూరిజం అభివృద్ధికి 12 ఎకరాల 20 గుంటల భూమిని కేటాయించారు. ప్రాజెక్ట్​ నిర్మించినప్పుడే నిజాం నవాబు గోల్ బంగ్లా నిర్మించారు.

బంగ్లా పైనుంచి చూస్తే ప్రాజెక్ట్​తోపాటు పరిసరాల అందాలు కనువిందు చేస్తాయి. ఈ గోల్ దగ్గరగానే ఎకో టూరిజానికి స్థలాన్ని కేటాయించారు.  పనుల టెండర్ల పక్రియ కంప్లీట్ కాగా, త్వరలో  షూరు చేయనున్నారు.  ప్రధానంగా డీలక్స్ రూమ్స్​ 10,  సూట్ రూమ్స్​ 7,  యోగ, స్పా సెంటర్,​ రెస్టారెంట్,  రిసెప్షన్ సెంటర్​, స్వాగత తోరణం,  చిల్ర్డన్స్ పార్కు,  ల్యాండ్​ సీపింగ్, థీమ్ పార్కు, పార్టీ లాన్ నిర్మించనున్నారు. సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.     

త్వరలో బోటింగ్​ పనులు..

ప్రాజెక్ట్​లో బోటింగ్ పనులు త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. పర్యాటక పరంగా చేపట్టనున్న పనులపై ఇటీవల కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ టూరిజం డెవలప్​మెంట్ అధికారులతో రివ్యూ చేశారు.  డీఈ విద్యాసాగర్, ఏఈ  సోహెల్ తదితరులతో చర్చించారు.   

మరిన్ని ప్రదేశాల్లో పనులు..

ఐదేండ్ల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర సర్కార్ జిల్లాలోని పలు ఏరియాల్లో పనులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్​ నుంచి  నిజాంసాగర్​కు వచ్చేటప్పుడు మార్గమధ్యంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్​ ఉంది.  దీనికి సమీపంలోనే పోచారం అభయారణ్యం, జుక్కల్ మండలంలో కైలాస్ కోట,   లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావి వంటి పురాతన కట్టడాలు ఉన్నాయి.  వీటిని టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.