- మెడికల్ విద్యార్థులకు ఎన్ఎంసీ క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన మన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ సమయం, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం వల్ల మధ్యలో చదువు ఆపేసి ఇండియాకు వచ్చేసి ఆన్ లైన్ క్లాసులు విన్న స్టూడెంట్ల భవితవ్యంపై క్లారిటీ ఇచ్చింది. విదేశీ మెడికల్ కాలేజీల్లో అదనపు క్లాసులను ఫిజికల్ క్లాసుల ద్వారా భర్తీ చేసుకుంటారో వారు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అక్కడ సాధ్యం కాకపోతే.. వారు ఇండియాలో ఒకటి లేదా రెండేళ్ల క్లినికల్ క్లర్క్‌షిప్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు క్లర్క్‌షిప్, ఇంటర్న్‌షిప్ రూల్స్ ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఫైనలియర్ కు ముందు, ఫైనలియర్లో ఆన్ లైన్ క్లాసులు విన్నవారు ఇండియాలో ఒకటి లేదా రెండేళ్ల క్లర్క్‌షిప్ చేయాలని వెల్లడించింది. విద్యార్థి విదేశాల్లోనే ఉండి చదువుకున్నాడా లేదా ఇండియాలో ఉండి ఆన్ లైన్ క్లాసులు విన్నాడా అనేది నిర్ధారించేందుకు పాస్ పోర్ట్ లోని ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులను తప్పనిసరిగా వెరిఫై చేయాలని స్టేట్ మెడికల్ కౌన్సిళ్లను ఆదేశించింది.
