ఆప్ తో పొత్తు లేదు: కాంగ్రెస్

ఆప్ తో పొత్తు లేదు: కాంగ్రెస్
  • ఢిల్లీలో ఒంటరిగానే పోటీ: షీలా దీక్షిత్
  • పార్టీ చీఫ్ రాహుల్ తో భేటీ తర్వాత ప్రకటన

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ‘చీపుర’ను పక్కను పెట్టింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 7 ఎంపీ సీట్లు ఉన్న ఢిల్లీలో ఒంటరి పోరుకే సిద్ధమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తుకు నో చెప్పింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ముందుకు సాగేందుకు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు మొగ్గు చూపకపోవడంతో వారిని మాటకే అధిష్ఠానం ఓటు వేసింది.

మంగళవారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్ సహా పలువురు సీనియర్ నేతలు బేటీ అయ్యారు. సమావేశం ముగిశాక షీలా దీక్షిత్ మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో ఆప్ తో పొత్తు లేదని, రాహుల్ తో జరిగిన బేటీలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారామె.

మహా కూటమిలో భాగంగా ఆప్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీలకు సయోధ్య కుదరకపోవడం వల్లే పొత్తుకు కాంగ్రెస్ సీనియర్లు నో చెప్పారని తెలుస్తోంది. ఢిల్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకునే సత్తా కాంగ్రెస్ కు ఉందని, అలాంటప్పుడు ఆప్ ప్రతిపాదిస్తున్న ఒకటి రెండు సీట్లకు ఎందుకు ఒప్పుకోవాలని రాహుల్ తో జరిగిన భేటీలో ఓ నేత అన్నారు.