వడ్లు తీసుకోకుంటే.. మిల్లు పర్మిషన్ క్యాన్సిల్

వడ్లు తీసుకోకుంటే..  మిల్లు పర్మిషన్ క్యాన్సిల్
  • బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకుంటే.. నో ప్యాడీ 
  • పెరిగిపోతున్న సీఎంఆర్​ పెండింగ్​.. డిఫాల్టర్లు
  • మిల్లర్ల భాగస్వాముల్లో పంచాయితీలు
  • బ్యాంక్​ గ్యారెంటీపై సివిల్​సప్లయ్​సీరియస్​

యాదాద్రి, వెలుగు: సీఎంఆర్​ పెండింగ్‌తో పాటు డిఫాల్ట్​మిల్లర్ల కారణంగా సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​ఇబ్బందులు పడుతోంది. ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.  కోట్ల విలువైన వడ్లను మిల్లర్లకు ఇస్తూ విసిగిపోయిన సివిల్ సప్లయ్ శాఖ బ్యాంక్​ డిపాజిట్ చెల్లించిన వారికే వడ్లు ఇస్తామని మిల్లర్లకు ఆర్డర్​జారీ చేసింది. డిపాజిట్​చెల్లించలేమన్న కారణంతో  సీఎంఆర్​ తీసుకోకుంటే మిల్లుల పర్మిషన్లు క్యాన్సిల్​ చేస్తామని కూడా హెచ్చరించింది.  

డిఫాల్ట్​ మిల్లర్లు.. మిల్లుల భాగస్వాముల మధ్య పంచాయితీ

బ్యాంక్​ గ్యారెంటీ ఉంటేనే మిల్లర్లకు సీఎంఆర్​ అప్పగించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. మిల్లు కెపాసిటీ బట్టి అప్పగించే సీఎంఆర్​ విలువలో 10 శాతం బ్యాంక్​లో డిపాజిట్​ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక మిల్లుకు రూ. 5 కోట్ల విలువైన వడ్లు ఇస్తే బ్యాంకులో రూ.50 లక్షలు డిపాజిట్​ చేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్​ గ్యారంటీ ఇస్తామని చెప్పిన మిల్లర్లు ఆ తర్వాత ఇవ్వలేదు. అయినప్పటికీ ఇప్పటివరకూ సీఎంఆర్​ కోసం సివిల్​ సప్లయ్​  డిపార్ట్​మెంట్​ వడ్లను అప్పగించింది. అయితే సీఎంఆర్​ విషయంలో కొందరు మిల్లర్లు తప్ప చాలా మంది ఆలస్యం చేస్తున్నారు. ఒక్క యాదాద్రి జిల్లాలోనే మూడు సీజన్లకు సంబంధించిన రూ. 500 కోట్లకు పైగా విలువైన వడ్లు మిల్లుల్లోనే ఉన్నాయి. 

పైగా ముగ్గురు మిల్లర్లు డిఫాల్టర్లుగా తేలారు. వీటిలో ఒక్క మిల్లుపై ఆర్​ఆర్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేసి  గతంలోనే వేలం వేశారు. ఇవే కాకుండా గుండాల మండలం అనంతారంలోని ఒక మిల్లు, భూదాన్​పోచంపల్లి మండలం ముక్తాపూర్​లో మిల్లు కలిపి రూ. 14 కోట్లకు పైగా పెండింగ్​లో ఉన్నాయి. ఈ రెండు మిల్లులపై ఆర్​ఆర్​ యాక్ట్​ ప్రయోగించారు. తాజాగా ఆలేరు నియోజకవర్గంలోని ఓ మిల్లు భాగస్వాముల మధ్య విబేధాలు వచ్చి విడిపోయారు. 

ఆ మిల్లు నుంచి గత వానాకాలం, యాసంగితో సీఎంఆర్​తో పాటు 2022–-23 యాసంగి టెండర్​ ప్యాడీకి సంబంధించిన మొత్తం రూ. 25 కోట్లకు పైగా సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​కు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఆ మిల్లు భాగస్వాముల మధ్య పంపకాల పంచాయితీ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ మిల్లు నుంచి రావలసిన మొత్తాన్ని సివిల్​ సస్లయ్​ శాఖ రాబట్టుకోవాల్సి ఉంది. 

10 శాతం గ్యారెంటీ తప్పనిసరి

ఇటువంటి పరిణామాలతో బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిన మిల్లర్లకే సీఎంఆర్​ కోసం వడ్లు అప్పగించాలని తీసుకున్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు. నవంబర్​ నుంచి వానాకాలం సీజన్​కు సంబంధించిన కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్​కు సంబంధించి 4.58 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అందులో కొనుగోలు సెంటర్లకు  సుమారు రూ. 710 కోట్ల విలువైన 3 లక్షల టన్నులు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. వీటిని సీఎంఆర్​ కోసం ఇవ్వాలంటే విలువలో 10 శాతం లెక్కిస్తే రూ.70 కోట్లకు పైగా మిల్లర్లు బ్యాంక్​ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. డిఫాల్ట్​ మిల్లర్లకు మాత్రం 25 శాతం డిపాజిట్​ చేయాలని సూచించింది. 

తీసుకోకుంటే.. మిల్లు పర్మిషన్​ క్యాన్సిల్​

అయితే బ్యాంకు గ్యారెంటీ ఇవ్వలేమన్న కారణంతో వడ్లు తీసుకోకుంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జిల్లాలోని మిల్లుల్లు 3.25 లక్షల టన్నుల మిల్లింగ్​ కెపాసిటీ కలిగ ఉన్నాయి. బ్యాంక్​ గ్యారెంటీ చూపించి కెపాసిటీలో కనీసం 50 శాతం వడ్లు తీసుకొని సీఎంఆర్​ అప్పగించాలని సూచించింది. డిపాజిట్​ చెల్లింకుండా ప్యాడీ తీసుకోని మిల్లులకు ఇచ్చిన పర్మిషన్లు క్యాన్సిల్​ చేస్తామని  హెచ్చరించింది. ఆ తర్వాత మిల్లుకు తాళం వేసుకోవాల్సి ఉంటుందని సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ స్పష్టం చేసింది. 

గ్యారెంటీ ఇవ్వాల్సిందే.. ప్యాడీ తీసుకోవాల్సిందే 

ఈ వానాకాలం సీజన్​ నుంచి బ్యాంక్​ గ్యారెంటీ ఇచ్చిన మిల్లులకే ప్యాడీ ఇస్తాం. మిల్లింగ్​ కెపాసిటీ ఆధారంగా ప్రతి మిల్లుకు ప్యాడీ కేటాయిస్తాం. అందుకనుగుణంగా బ్యాంక్​ గ్యారెంటీ చూపించాలి.  మిల్లింగ్​ కెపాసిటీలో కనీసం 50 శాతం ప్యాడీ తీసుకోవాలి. గ్యారెంటీ ఇవ్వలేమని, ప్యాడీ తీసుకోకుంటే.. ఆ మిల్లుకు ఇచ్చిన పర్మిషన్లను క్యాన్సిల్​ చేస్తాం.–  వీరారెడ్డి, అడిషనల్​ కలెక్టర్​, యాదాద్రి