లక్షలు పెడతామన్నా బెడ్లు లేవ్.. నరకం చూస్తున్న కరోనా పేషెంట్లు

లక్షలు పెడతామన్నా బెడ్లు లేవ్.. నరకం చూస్తున్న కరోనా పేషెంట్లు

ట్రీట్మెంట్ అందక కరోనా పేషెంట్లకు నరకం
ప్రైవేటు హాస్పిటళ్లు అన్నీ ఫుల్..
హైలెవల్లో సిఫారసు ఉంటేనే బెడ్
బెడ్ దొరికినా నో ఇన్సూరెన్స్..నో హెల్త్‌ పాలసీ.. ఓన్లీ క్యాష్‌
సింప్టమ్స్ తో పాటు పాజిటివ్ రిపోర్ట్ ఉంటేనే గాంధీలోకి ఎంట్రీ
అటూ ఇటూ తిప్పుతున్న సర్కార్ దవాఖాన్లు
ఆక్సిజన్‌, వెంటిలేటర్లకు అంతటా కొరత

కరోనా వస్తే పట్టించుకునే దిక్కు లేకుండా పోతోంది. అటు ప్రైవేటు హాస్పిటళ్లలో బెడ్లన్నీ ఫుల్ అయిపోవడం.. ఇటు ప్రభుత్వ హాస్పిటళ్లు ఆడికి ఈడికి తిప్పడం.. పేషెంట్లను భయాందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్ పేషెంట్లను ఇంటికే పంపిస్తున్న ప్రభుత్వం.. వారికి కనీస అవసరాలను కూడా తీర్చడం లేదు. మానిటరింగ్ చేయాల్సిన లోకల్ ఆఫీసర్లు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒక వేళ పేషెంట్కు పరిస్థితి విషమిస్తే.. ఏ హాస్పిటల్లో చేరాలో అంతుచిక్కడం లేదు. ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్తే.. బెడ్లు లేవనే సమాధానం వస్తోంది. లక్షలు పెడ్తామన్నా చేర్చుకోవడం లేదు.

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో ట్రీట్మెంట్ అందక కరోనా పేషెంట్లు నరకం అనుభవిస్తున్నారు. ఏ హాస్పిటల్ కు వెళ్లాలో తెలియక.. వెళ్తే బెడ్లు ఉంటాయన్న గ్యారెంటీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్తే.. సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. పాజిటివ్ రిపోర్ట్ తీసుకురావాలంటూ.. సింప్టమ్స్ ఉండాలంటూ.. బాధితులను గాంధీ లాంటి సర్కారు దవాఖాన్లు అటూ ఇటూ తిప్పుతున్నాయి. పాజిటివ్ రిపోర్ట్ ఉన్నా.. సింప్టమ్స్ లేవని వెనక్కి పంపుతున్నాయి. ఒక వేళ సివియర్ సింప్టమ్స్ ఉన్నా.. పాజిటివ్ రిపోర్ట్ లేదని నిరాకరిస్తున్నాయి. ఎంతో కొంత స్తోమత ఉన్నవాళ్లు అప్పోసప్పోచేసి కార్పొరేట్‌ హాస్పిటళ్లలో ట్రీట్‌మెంట్‌కు రెడీ అయితే.. అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. బెడ్లులేవని.. వేరే హాస్పిటల్ చూసుకోండని వెనక్కి పంపుతున్నారు. ఇట్ల పేషెంట్లను వెహికల్లో తీసుకొని వారి బంధువులు హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ హాస్పిటళ్లలో ఒక్క బెడ్‌ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇక ఆక్సిజన్‌, వెంటి లేటర్‌ లాంటి సౌకర్యాలతో కూడిన ఐసీయూ ఫెసిలిటీ దొరకడమన్నది ఓ గగనమే. అతి కష్టమ్మీద, అది కూడా హైలెవల్ సిఫారసుతో బెడ్ దొరికించుకుంటే.. దానికి లక్షల్లో ఫీజులు ముందస్తుగానే కట్టాల్సి వస్తోంది. ఇన్సురెన్సులు, హెల్త్ పాలసీలను తీసుకోవడం లేదు.

ప్రైవేటులో బెడ్లు లేవ్.. ఒక వేళ దొరికినా నెట్ పేమెంట్
కరోనా పేషెంట్ల దుస్థితి గురించి ఇప్పటికే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌‌ అయ్యాయి. ఆక్సిజన్‌ ‌అందక కొందరు.. పట్టించుకునే హెల్త్ స్టాఫ్ లేక ఇంకొందరు.. ఎన్ని హాస్పిటళ్లు తిరిగినా బెడ్లు దొరకక మరికొందరు.. తమ దీనగాథను వీడియోలు తీసి రిలీజ్ చేశారు. కొందరికైతే ఆ వీడియోనే డెత్‌‌ స్టేట్‌‌మెంట్‌‌ అయిన పరిస్థితి. గురువారం కూడా ఓ వీడియో వైరల్ అయింది. ఎనిమిది హాస్పిటళ్లు తిరిగినా అడ్మిషన్‌ ‌దొరకలేదని, చివరికి ఒక హాస్పిటల్‌‌లో ఐదు లక్షలు డిమాండ్‌‌ చేస్తే.. మూడు లక్షలు కట్టి చేర్పించామని హైదరాబాద్ కు చెందిన పేషెంట్ అటెండ్స్ బాధను వెలిబుచ్చారు. ‘‘మేం అప్పర్‌ ‌మిడిల్‌ ‌క్లాస్‌ ‌కాబట్టి పే చేయగలిగాం. సామాన్యుడి పరిస్థితి ఏం కావాలి?’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో పేషెంట్ ది ఇదే పరిస్థితి. వరంగల్ నుంచి హైదరాబాద్ కు ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఓ పేషెంట్ కు.. సాయంత్రం వరకు బెడ్ సిద్ధం చేస్తామని చెప్పి అన్నిటెస్టులు చేసిన ఓ కార్పొరేట్ హాస్పిటల్ చివరికి బెడ్ లేదని చేతులెత్తేసింది. అతి కష్టం మీద వేరే హాస్పిటల్లో బెడ్ దొరికితే.. నెట్ పేమెంట్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్లు పనిచేయవని తేల్చిచెప్పారు. ఇలాంటి అనుభవాలు ఒకరిద్దరికే కాదు రోజూ రాష్ట్రంలో అనేక మందికి ఎదురవుతున్నాయి. ఏ ప్రైవేటు హాస్పిటల్లోనూ బెడ్లు దొరకడం లేదు. ఒక వేళ దొరికినా నెట్ పేమెంట్ లక్షల్లో కట్టాల్సి వస్తోంది. ఇన్సూరెన్సులు, హెల్త్ పాలసీలు ఎన్ని ఉన్నా.. వాటిని యాక్సెప్ట్ చేయడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్‌ ‌హాస్పిటళ్ల పరిస్థితి ఇట్లా ఉంటే.. ప్రభుత్వ
హాస్పిటళ్ల సంగతి మరోలా ఉంది. అటూ ఇటు తిప్పుతున్న సర్కార్ దవాఖాన్లు కరోనా పాజిటివ్‌‌ సర్టిఫిర్టికెట్‌‌తో పాటు సింప్టమ్స్‌‌ ఉంటేనే గాంధీ హాస్పిటల్లో అడ్మిషన్‌‌ దొరుకుతున్నది. పాజిటివ్‌‌ ఉండి సింప్టమ్స్‌‌ లేకపోతే వెనక్కి పంపుతున్నారు. సింప్టమ్స్ ఉన్నా.. రిపోర్ట్ రాకపోతే కూడా వెనక్కే పంపుతున్నారు. వేరే ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లాలని రిఫర్‌‌ చేస్తున్నారు. అక్కడ కూడా అడ్మిషన్‌‌ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. గాంధీకి వెళ్తే.. కింగ్ కోఠికి అంటూ, కింగ్ కోఠికి వెళ్తే.. గాంధీకి అంటూ ఇట్ల హాస్పిటళ్ల చుట్టూ తిప్పుతున్నారు. కరోనా పేషెంట్లకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని సర్కా రు ఎన్ని మాటలు చెబుతున్నా ఆచరణలో ఏదీ కనిపించడం లేదు. దీంతో కరోనా లేని వాళ్లు ఎప్పుడు అంటుకుంటదేమోనన్న భయంతో.. వచ్చిన వాళ్లు ఎట్ల కోలుకుంటమోనన్న భయంతో వణికిపోతున్నారు.

ఎనిమిది హాస్పిటళ్లు తిరిగినా పట్టలే..
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కు చెందిన మోహన్ కు ఇటీవల కరోనా టెస్టు చేయిస్తే నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో పక్కింటి యువకుడి కారులో దగ్గర్లోని అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బెడ్స్ ఖాళీగా లేవని చెప్పడంతో తెలిసిన పొలిటికల్ ల్లీడర్లు, వ్యక్తులతో ఎంత ఇన్ ఫ్లూయన్స్ ఉపయోగించినా ఫలితం కనిపించలేదు. వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కు వెళితే అక్కడా అదే పరిస్థితి. తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. బెడ్స్ ఖాళీ లేవని బయటి నుంచి బయటికే పంపించారు. తర్వాత సన్ షైన్ హాస్పిటల్ కు వెళితే అక్కడా అడ్మిట్ చేసుకోలేదు. నిజాంపేటలోని ఓ హాస్పిటల్ కు, కూకట్ పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్ కు తీసుకెళ్తే చేర్చుకునేందుకు నిరాకరించారు. తమకు తెలిసినవారిని ఫోన్లో సంప్రదిస్తూనే సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్ కు తీసుకెళ్తే.. తమ హాస్పిటల్లో ఒకటే బెడ్ ఉందని, రూ.5 లక్షలు కడితే చేర్చుకుంటామన్నారు. అన్ని డబ్బులు కట్టే పరిస్థితి లేకపోవడంతో వెంటనే బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్, విరించి హాస్పిటల్ కు వెళ్తే సెక్యూరిటీ గార్డులతో బయటి నుంచి బయటికే పంపించేశారు. దీంతో చేసేదేమీ లేక చివరికి డెక్కన్ హాస్పిటల్ కే తిరిగొచ్చి అప్పటికప్పుడు తెలిసినవారి నుంచి ఆన్లైన్ ద్వారా రూ. 3 లక్షలు సర్దుబాటు చేసి మోహన్ ను ఫ్రెండ్స్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ లో బెడ్ కోసం హైదరాబాద్ నగరంలో 2 గంటలపాటు అనుభవించిన నరక యాతనను, ప్రైవేట్ హాస్పిటళ్ల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్యూర్ ను వివరిస్తూ మోహన్ కు సాయం చేసేందుకు వెళ్లిన యువకుడు రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెడ్స్‌ లేవు.. ఖాళీ చెయ్..!
వరంగల్‌కు చెందిన ఒక యువకుడు కరోనా అనుమానంతో గురువారం ఉదయం హైదరాబాద్ కు వచ్చాడు. వారం రోజులుగా జర్వంతో బాధపడుతున్నాడు. ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గుతున్నాయనే అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లాడు.ఆయనను ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకొని సీటీ స్కాన్‌తో పాటు రకరకాల టెస్టులు చేశారు. సెలైన్‌ పెట్టి బెడ్‌ మీద పడుకోబెట్టారు. కరోనా లక్షణాలున్నాయని, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్నాయని, సాయంత్రం వార్డులో బెడ్‌ ఇస్తామని చెప్పారు. తీరా సాయంత్రం వచ్చి ఆక్సిజన్‌ లేదని, బెడ్‌ కూడా కష్టమేననీ చెప్పారు. వేరే హాస్పిటల్లో వెతుక్కోవాలని చెప్పారు. దాంతో పేషెంట్‌, అతడి బంధువుల్లో టెన్షన్‌ మొదలైంది. హాస్పిటల్‌ సిబ్బంది ప్రతి పది నిముషాలకోసారి వచ్చి ఎమర్జెన్సీ వార్డులోని బెడ్‌ ఖాళీ చేయాలని ఒత్తిడి పెంచారు. హైదరాబాద్‌లో పరిచయమున్న మిత్రులు, ఊర్లలో ఉన్న పొలిటికల్‌ సర్కిల్స్‌ అందరూ కలిసి ప్రయత్నం చేస్తే నాలుగైదు గంటల తర్వాత వేరే హాస్పిటల్‌లో బెడ్‌
దొరికింది. అది కూడా అప్పటికప్పుడు క్యాష్  కడితేనే.

For More News..