
పాకిస్తాన్ కు చెందిన చైల్డ్ టీవీ స్టార్ ఉమర్ షా కన్నుమూశారు. అతి చిన్నవయస్సులోనే మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఎంటర్టైన్మెంట్ రంగం శోకసంద్రంలో మునిగిపోయింది. అమాయకమైన నవ్వులు, సరదా సంభాషణలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ ఉమర్.. తన స్వస్థలమైన డేరా ఇస్మాయిల్ ఖాన్ లో గుండెపోటుతో మృతి చెందారు. కేవలం 15 సంవత్సరాలకే మరణించడం అందరిని దుఃఖం సాగరంలో నింపింది.
ఉమర్ తన అన్న అహ్మద్ షాతో కలిసి సోషల్ మీడియా, టీవీ షోలలో కనిపించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఉమర్ షా మరణంపై స్వయంగా అతని అన్న అహ్మద్ షా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. "మా కుటుంబంలో ఒక వెలుగు రేఖ అయిన చిన్న స్టార్ ఉమర్ షా అల్లా వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరూ ఉమర్‌ను, మా కుటుంబాన్ని మీ ప్రార్థనలలో గుర్తుంచుకోవాలని కోరుతున్నాను" అని ఇన్ స్టాగ్రామ్ లో అహ్మద్ షా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
నవంబర్ 2023లో, ఈ సోదరులు తమ చిన్న చెల్లి ఆయేషా మరణంతో విషాదంలో మునిగిపోయారు. ఇప్పుడు ఉమర్ షా మరణంతో కుటుంబంలో మళ్లీ విషాదం నెలకొంది. ఉమర్ తన అన్నయ్య అహ్మద్‌తో కలిసి సోషల్ మీడియాలో, టీవీలో సంచలనం సృష్టించారు. ముఖ్యంగా 'పీచే తో దేఖో' అనే వారి రీల్ దేశవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయ్యింది. వారి అమాయకమైన నవ్వులు, సరదా సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అన్నదమ్ములిద్దరూ 'జీతో పాకిస్తాన్', 'షాన్-ఎ-రమజాన్' వంటి పాపులర్ షోలలో కనిపించి ఇంటింటి పేరుగా మారారు.
ALSO READ : Rishab Shetty: 'డ్రాగన్' లో జూ. ఎన్టీఆర్‍తో రిషబ్ శెట్టి.. పవర్ఫుల్ రోల్‌తో ఎంట్రీ?
ఉమర్ షా మరణ వార్త విని సినీ, టీవీ పరిశ్రమల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'జీతో పాకిస్తాన్' షో హోస్ట్ ఫహద్ ముస్తాఫా.. కన్నీటీపర్యంతమైయ్యారు. సంతోషం, అమాయకత్వం నిండిన కాంతి పుంజం అని ఉమర్ ను నటుడు అద్నాన్ సిద్దిఖీ అని పేర్కొన్నారు. యువకుడు మరణం తనను చాలా బాధపెట్టిందన్నారు. చిన్న దేవదూత.. అందరికీ నవ్వులు పూంచిన మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న ఉమర్ మరణం తనను తీవ్ర దిగ్భాంత్రికి గురిచేసిందని తెలిపారు. ఉమర్ చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం అని మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ సంతాపం తెలిపారు.