స్వప్రయోజనాలకే జగన్, కేసీఆర్ భేటీ: బండి సంజయ్

స్వప్రయోజనాలకే జగన్, కేసీఆర్ భేటీ: బండి సంజయ్

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ల భేటీ వెనకాల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు లేవని, ఇద్దరి స్వప్రయోజనాలే దాగి ఉన్నాయని కరీంగనర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఆరోపించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి ఆర్థిక లావాదేవీలు, భూ దందాలను అడ్డదారుల్లో పరిష్కరించుకునేందుకే ఇరువురు తరుచుగా భేటీ అవుతున్నారని అన్నారు. ఇద్దరూ ఎన్ని సార్లు భేటీ అయినా,ఇరు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నబిజేపీని అడ్డుకోలేరని చెప్పారు. ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వంలో ఇప్పటికే 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, ఇక నెక్స్‌‌ట్ టార్గెట్ తెలంగాణే అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ తీరు, అధికా రంలోకి వచ్చాక చంద్రబాబు,జగన్ లతో వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. మాయల ఫకీర్, తుపాకీ రాముడి వేషాలతో మోసం చేస్తోన్న కేసీఆర్ కు ప్రజా కోర్టులో ప్రజలు శిక్ష విధిస్తారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే, ఇరు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్ ప్రభుత్వాలను కూల్చి, బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు.