మున్సిపాలిటీల్లో ఎస్టీపీల నిర్మాణానికి హ్యామ్‌‌ విధానం వద్దు

మున్సిపాలిటీల్లో ఎస్టీపీల నిర్మాణానికి  హ్యామ్‌‌ విధానం వద్దు
  • ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు..మూడుసార్లు టెండర్లు పిలిచినా నో రెస్పాన్స్
  • రూల్స్ మార్చాలని మున్సిపల్  అధికారులకు కాంట్రాక్టర్ల లేఖ
  • కాంట్రాక్టర్ల వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సివరేజ్ ట్రీట్​మెంట్ ప్లాంట్లు (ఎస్​టీపీ) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణంలో కేంద్రం నుంచి అమృత్, స్వచ్ఛ భారత్  మిషన్  స్కీమ్  ఫండ్స్ తో పాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా నిధులు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణ బాధ్యత మున్సిపల్  శాఖలోని పబ్లిక్  హెల్త్  ఇంజినీరింగ్  (పీహెచ్)కు అప్పగించారు. డీపీఆర్, డిజైన్ల కోసం పబ్లిక్  హెల్త్  అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచారు. 

అయితే వీటి నిర్మాణానికి  ఒక్క కాంట్రాక్టు ఏజెన్సీ కూడా ముందుకు రావడంలేదు. అసలు ఎస్టీపీల నిర్మాణం అంటేనే జంకుతున్నారు. వీటిని హైబ్రిడ్  యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో నిర్మించాలని నిర్ణయించడమే కారణమని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు మార్చాలని ప్రభుత్వానికి పీహెచ్ఎంఈ లేఖ రాసింది. హ్యామ్  మోడల్ లో పనులు చేయలేమని, రూల్స్  మార్చాలని కాంట్రాక్టర్లు.. పబ్లిక్  హెల్త్  అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు మార్చాలని ప్రభుత్వానికి లేఖ రాశామని, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్​లో 115 ఎస్టీపీలు

రాష్ట్రంలో 160  పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీలు) ఉన్నాయి. వీటిలో 16  మున్సిపల్  కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలు ఉన్నాయి. స్వచ్ఛ భారత్  మిషన్  2.0లో భాగంగా రాష్ట్రంలోని 101 పట్టణ స్థానిక సంస్థల్లో 455 ఎంఎల్డీ సామర్థ్యంతో 115 ఎస్టీపీలను  నిర్మించాలని 2024లో రాష్ట్ర  ప్రభుత్వం  నిర్ణయించింది.  వీటిని నిర్మించడానికి రూ.1,323.10 కోట్లు ఖర్చవుతుందని, పదేండ్ల పాటు నిర్వహణ  రూ.1,608.50 కోట్లు అవుతుందని ఇంజినీరింగ్  అధికారులు అంచనా వేశారు. అయితే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అంచనా వ్యయం రూ.3,769 కోట్లకు చేరింది.

 ఎస్బీఎం నిబంధనల ప్రకారం ఎస్టీపీ నిర్మాణానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఎస్టీపీకి కావాల్సిన నెట్​వర్క్  పైప్ లైన్  నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిందే.  ఎస్టీపీ నిర్మాణానికి తక్కువ ఖర్చవుతుందని, వీటి కనెక్టివిటికి మాత్రం భారీగా వ్యయం అవుతుందని పబ్లిక్  హెల్త్  అధికారులు చెబుతున్నారు. నిధుల కొరత ఉండడంతో ఎస్టీపీల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ లోకి మార్చింది. హ్యామ్ లో భాగంగా ప్రాజెక్టు అంచనా వ్యయంలో  40% ప్రభుత్వ వాటా, 60% కాంట్రాక్టు ఏజెన్సీ కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మున్సిపాలిటీల్లో 60% నిధులు పెట్టి ఎస్టీపీలను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. 

ఎస్టీపీల నిర్మాణం కీలకం

దేశవ్యాప్తంగా పట్టణీకీకరణ శరవేగంగా పెరుగుతోంది. గ్రామాల నుంచి ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం కోసం పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన ప్రభుత్వాలకు చాలెంజ్​గా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అన్ని మున్సిపాలిటీల్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టాల్సి ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.