యూనిఫాంలు రాలే.. పుస్తకాలు అందలే..

యూనిఫాంలు రాలే.. పుస్తకాలు అందలే..
  • స్కూళ్లు రీ ఓపెనింగ్​కు​ మిగిలింది మూడు రోజులే
  • రెండు యూనిఫాంలకు కుట్టుకూలి  వందేనట... 
  • జిల్లాకు ఇంకా చేరని 3 లక్షల బుక్స్​

ఆదిలాబాద్, వెలుగు: మరో మూడు రోజుల్లో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. మొదటి వారంలోనే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు ఇవ్వాలి. కానీ.. జిల్లాలో ఆ పరిస్థితి కనిపించంలేదు. గతేడాది కరోనా కారణంగా యూనిఫాంలు పంపిణీ చేయలేదు. దీంతో స్టూడెంట్లు రంగురంగు దుస్తులు, పేదలు చినిగిపోయిన డ్రస్సుల్లో తరగతులకు హాజరయ్యారు. ఇప్పుడు కూడా పాత దుస్తుల్లోనే పాఠశాలలకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పది రోజులుగా విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట నిర్వహిస్తున్నారు. ఆఫీసర్లు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అన్ని వసతులు కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. యూనిఫాం, పుస్తకాలపై మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో పరిస్థితి  గందరగోళంగా తయారైంది.
 
ప్రతీ విద్యార్థికి రెండు జతలు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందజేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 702  ప్రభుత్వ పాఠశాలల్లో 59 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి యూనిఫాంలు అందించేందుకు ముందుగా స్కూల్ యజమాన్యానికి బట్ట పంపిస్తారు. ఇప్పటికే ఇందు కోసం ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొంటున్నారు. ప్రతిపాదనల ప్రకారం ఇప్పటి వరకు 164 స్కూళ్లకు సంబంధించి 31,619 వేల మంది కోసం1,94,759 మీటర్ల క్లాత్ వచ్చింది. కానీ... యూనిఫాం కుట్టడం కోసం ఫండ్స్​ మాత్రం విడుదల కాలేదు. ఒకవేళ స్కూళ్లు ప్రారంభించిన తర్వాత ఫండ్స్​రిలీజ్​అయినా... కొలతలు, కుట్టడం కోసం కనీసం రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో పంద్రాగస్టు నాటికి కూడా యూనిఫాంలు స్టూడెంట్లకు  అందే అవకాశం లేదు. అంటే సెప్టెంబర్ వరకు విద్యార్థులు పాత దుస్తుల్లోనే బడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు యూనిఫాం కుట్టుకూలి రెండు జతల కోసం గవర్నమెంట్​రూ. వంద మాత్రమే ఇస్తుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కానీ.. ఆ డబ్బులకు దర్జీలు రెండు డ్రస్సులు కుట్టి ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. ప్రభుత్వం టైలరింగ్​ చార్జీలు  సరైన టైంలో ఇస్తేనే యూనిఫాంలు కుట్టే అవకాశం ఉంటుంది.
 
పుస్తకాలు లేటే..
ముందస్తుగానే యూనిఫాంలు, పుస్తకాలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడనున్నారు. యూనిఫాంలకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుపోగా.. పుస్తకాలు సైతం అరకొరగానే వచ్చినట్లు తెలిసింది. గతేడాది ఏప్రిల్ లోనే పుస్తకాలు పంపిణీ చేసిన సర్కార్​.. ఈ ఏడాది మాత్రం ఇంత వరకు పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 లక్షల పుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం 2 లక్షలు మాత్రమే వచ్చాయి. 

ప్రతిపాదనలు పంపించాం
పాఠశాలలు ప్రారంభానికి అన్ని సిద్ధం చేశాం. బడి బాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను స్కూళ్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు అందించే యూనిఫాంలకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటి వరకు 31,619 మంది స్టూడెంట్లకు సంబంధించిన క్లాత్ అందించారు. ఇంకా 3 లక్షల పుస్తకాలు రావాల్సి ఉంది.
- ప్రణీత, డీఈవో