కెమెరా లేదు.. షూటింగ్ లేదు.. పూర్తిగా AIతో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం 'వాగ్దాత భూమి'!

కెమెరా లేదు.. షూటింగ్ లేదు.. పూర్తిగా AIతో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం 'వాగ్దాత భూమి'!

సినీ రంగంలో ఊహించని సాంకేతిక విప్లవం వచ్చేసింది. కెమెరాలు, లైట్లు, భారీ సెట్టింగులు ఉంటేనే సినిమా అనుకునే రోజులకు కాలం చెల్లిపోతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి మాలీవుడ్ తెరలేపింది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా కెమెరాతో షూట్ చేయకుండా, పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రూపుదిద్దుకున్న చిత్రం 'వాగ్దాత భూమి' (Vagdatha Bhoomi). త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారతదేశపు మొట్టమొదటి “AI ఆర్ట్‌హౌస్” మూవీగా ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించనుంది.

కెమెరా లేదు.. యాక్షన్ మాత్రమే.!

సాధారణంగా సినిమా అంటే లొకేషన్లు, షూటింగులు, రీ-టేకులు ఉంటాయి. కానీ 72 నిమిషాల నిడివి గల ఈ పూర్తి స్థాయి సినిమాను కేవలం కంప్యూటర్ల ముందు కూర్చుని, ప్రపంచస్థాయి ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి సృష్టించారు. గూగుల్ వీఓ 3 (Veo 3), హిగ్స్‌ఫీల్డ్, ఓపెన్ ఆర్ట్, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ (ChatGPT), గూగుల్ జెమిని, ఎలెవెన్‌ల్యాబ్స్, సీడెన్స్ 2 వంటి అత్యాధునిక సాంకేతికతలను మిక్స్ చేసి ఈ విజువల్ వండర్‌ను మలిచారు.

నిజమైన మాయాజాలం!

ఇందులో మరో క్రేజీ ఎలిమెంట్ ఏంటంటే.. కార్టూన్లు , గ్రాఫిక్స్ బొమ్మల్లా కాకుండా, క్యారెక్టర్ల హావభావాలు సహజంగా ఉండటం కోసం నిజమైన మనుషుల ముఖాలను ఏఐ రిఫరెన్స్‌లుగా వాడుకున్నారు. షాజు వలప్పన్, డాక్టర్ అనశ్వర, సురేష్ నెల్లిక్కోడ్, జోస్ మాంపిల్లి వంటి పలువురు వ్యక్తుల ముఖాలను మోడల్స్‌గా తీసుకుని తెరపై అద్భుతాన్ని ఆవిష్కరించారు. జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధిక్ పరవూర్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించగా.. ప్రముఖ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ షాజు వలప్పన్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించారు. కొడుంగల్లూర్‌లోని చంద్రబోస్ బ్యాండ్ స్టూడియోలో ఈ చిత్ర సాంకేతిక పనులన్నీ పూర్తయ్యాయి.

ALSO READ :  తెలుగు తెరపై మరో సైన్స్ ఫిక్షన్..

ఎమోషన్స్ పీక్స్!
టెక్నాలజీతో చేసినంత మాత్రాన ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకుంటే పొరపాటే. టెక్నాలజీ పరంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటూనే.. కథ పరంగా మనుషుల మధ్య ఉండే బంధాలు, రైతుల జీవితాల్లోని భావోద్వేగాల చుట్టూ సాగే ప్యూర్ హ్యూమన్ డ్రామా ఇది. రోబోటిక్ విజువల్స్‌తో గుండెకు హత్తుకునే సెంటిమెంట్‌ను ఎలా పండించారో చూడాలనే క్యూరియాసిటీ ఇండస్ట్రీ వర్గాల్లో పెరిగిపోయింది. మొదట ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన తర్వాత, ఈ 'వాగ్దాత భూమి'ని థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా, హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీని మాలీవుడ్ మేకర్స్ వాడేసిన తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో సినిమా మేకింగ్ స్టైలే మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది..