పెద్దపల్లి ఎన్టీపీసీలో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ ఏర్పాటు చేయలేదు .. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

పెద్దపల్లి ఎన్టీపీసీలో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ ఏర్పాటు చేయలేదు .. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లిలోని ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్​లో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ ఏర్పాటుకు ఎలాంటి ప్రణాళిక ప్రస్తుతం లేదని కేంద్రం వెల్లడించింది. దేశంలోని కొన్ని కేంద్రాల్లో చిన్న స్థాయి ప్రయోగాత్మక ప్రాజెక్టులనే నిర్వహిస్తున్నట్లు తెలిపిం ది. అలాగే పవర్ ప్లాంట్లకు పది కి.మీ. పరిధిలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన స్టడీ కూడా చేపట్టలేదని పేర్కొంది. అయితే, 2017–18 లో చేపట్టిన ‘ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ ఎపిడెమిక్ హెల్త్ డిజాస్టర్ సర్వే’, ఇతర స్టడీల ఆధారంగా ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడడం లేదని తేలిందంటూ పాత రికార్డులను చూపింది. ఆ మేరకు గురువారం లోక్ సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

అయితే.. ఎన్టీపీసీ రామగుండం పరిధిలో కాలుష్యంపై ఎంపీ వంశీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని రెండు బొగ్గు ఆథారిత పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ లిమిటెడ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఒకటి రామగుండం (2,600 మెగావాట్లు), తెలంగాణ (1,600 మెగావాట్ల) థర్మల్ పవర్ ప్లాంట్లుగా పేర్కొన్నారు. ఇవి పక్కపక్కనే ఉన్నాయని వివరించారు. ఆ ప్లాంట్ల సమీపంలో కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నమోదు చేయబడిన పార్టిక్యులేట్ మ్యాటర్స్(పీఎం), సల్పర్ డయాక్సైడ్ సహా ఇతర హానికారక ఉద్గారాల డేటాను ఈ సమాధానానికి జోడించారు.