
- ద్రవ్యోల్బణం తగ్గడంతో డిసెంబర్ మీటింగ్‌లో కోత ఉండే అవకాశం
- 2025-26 లో జీడీపీ వృద్ధి 6.8 శాతం ఉంటుందని అంచనా
- 2.6 శాతానికి తగ్గనున్న రిటైల్ ద్రవ్యోల్బణం
- యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు ఉండవు: ఆర్‌బీఐ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం (అక్టోబర్ 01) తన కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. అమెరికా విధించిన దిగుమతి సుంకాలు, గతంలో చేపట్టిన వడ్డీ రేట్ల కోత, తాజా జీఎస్‌టీ తగ్గింపుల ప్రభావం ఎంత ఉందో ఇంకా పూర్తిగా స్పష్టతకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక వ్యవస్థపై అమెరికా 50 శాతం టారిఫ్, హెచ్1బీ వీసా ఫీజు పెంపు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మాల్హోత్రా అన్నారు. రాబోయే నెలల్లో వడ్డీ తగ్గింపులకు అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు. ఆరు సభ్యుల గల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రెపో రేటును 5.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది.
పాలసీ వైఖరీ ‘నూట్రల్’ గా ఉంది. ఈ ఏడాది ఆగస్టు సమావేశంలో కూడా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి మీటింగ్ తర్వాత నుంచి ఇప్పటివరకు మొత్తం వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మాల్హోత్రా మాట్లాడుతూ, “ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వృద్ధికి మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయి. అయితే, గతంలో తీసుకున్న మానిటరీ లేదా ఫిస్కల్ చర్యల ప్రభావం ఇంకా కొనసాగుతోంది” అని తెలిపారు.
ఆర్‌బీఐ పాలసీలో ముఖ్యమైన అంశాలు..
దేశీయంగా డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, గ్లోబల్‌గా బలహీనంగా ఉంది. సాధారణ వర్షపాతం, తక్కువ ద్రవ్యోల్బణం, జీఎస్‌టీ సవరణలు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్దతు ఇస్తాయని మల్హోత్రా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.5శాతం నుంచి 6.8శాతానికి పెంచినప్పటికీ, అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్, తదుపరి కాలానికి అంచనాలు కొంత తగ్గే అవకాశం ఉందని అన్నారు. జూన్ క్వార్టర్‌లో జీడీపీ 7.8శాతం వృద్ధి నమోదు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణ అంచనాను 3.1శాతం నుంచి 2.6శాతానికి తగ్గించారు. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా ఉంది. ఆహార ధరలు తగ్గడం, జీఎస్‌టీ తగ్గింపులు ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్లో ఉంచుతాయని అంచనా.
అంతర్జాతీయ లావాదేవీల్లో రూపాయిని ప్రోత్సహించేందుకు, ఆర్‌బీఐ బుధవారం కీలక చర్యలు ప్రకటించింది. భూటాన్, నేపాల్, శ్రీలంకకు చెందిన వ్యక్తులకు భారతీయ బ్యాంకులు రూపాయిలో రుణాలు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్స్ (ఎస్‌ఆర్‌వీఏ) ఖాతాల ద్వారా కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లలో పెట్టుబడికి అవకాశం కల్పించింది. ఈ చర్యలు డాలర్‌పై ఆధారాన్ని తగ్గించి, కరెన్సీ ఒత్తిడిని తగ్గించనున్నాయి.
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ)ఖాతాదారులు ఇకపై డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉచితంగా ఉపయోగించవచ్చు. ఆర్‌బీఐ ఈ ఖాతాలకు అందించే సేవల పరిధిని విస్తరించింది. ఇప్పటికే ఏటీఎంల ద్వారా నగదు డిపాజిట్, నెలకు కనీసం నాలుగు విత్‌డ్రాయల వంటి సేవలు ఉచితంగా అందుతున్నాయి. ఇప్పుడు మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా చార్జీల్లేకుండా లభిస్తుంది.
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని సంజయ్ మాల్హోత్రా అన్నారు. క్రెడిట్‌పై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను ఈఎంఐ డిఫాల్ట్ జరిగితే రిమోట్‌గా లాక్ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఆర్‌బీఐ బుధవారం కీలక ప్రతిపాదనలు చేసింది. బ్యాంకులు షేర్లపై ఇచ్చే అప్పు పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.ఒక కోటికి, ఐపీఓ ఫైనాన్సింగ్‌ను రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెంచనుంది. దీంతో ఇన్వెస్టర్లకు లోన్ ఈజీగా అందుతుంది. రీట్స్, ఇన్విట్, లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలపై ఇచ్చే రుణాల పరిమితులను తొలగించనుంది.
బ్యాంకింగ్‌కు బూస్ట్
ఆర్‌బీఐ భారత బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి నాలుగు కీలక ప్రతిపాదనలు ప్రకటించింది.
రిస్క్ ఆధారంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియం: ఇప్పటి వరకు అన్ని బ్యాంకులు ఒకే రేటుతో డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించేవి. ఇకపై రిస్క్ ఆధారంగా, మెరుగైన రేటింగ్ ఉన్న బ్యాంకులు తక్కువ ప్రీమియం చెల్లిస్తాయి. దీంతో వీటి రిస్క్ మేనేజ్‌మెంట్ మెరుగువుతుందని అంచనా.
ఈసీఎల్ ఫ్రేమ్‌వర్క్: 2027 ఏప్రిల్ 1 నుంచి అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు (స్మాల్ ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకులు, రూరల్ బ్యాంకులు మినహాయించి) ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) ప్రొవిజనింగ్ వర్తించనుంది. దీంతో ఇప్పటికే ఉన్న లోన్లపై ఎక్కువ ప్రొవిజనింగ్ చేసే భారాన్ని తగ్గించుకోవడానికి వీలుంటుంది.
బాసెల్ 3 నిబంధనలు: 2027 నుంచి కొత్త బాసెల్ 3 క్యాపిటల్ అడెక్వసీ రూల్స్ అమలులోకి వస్తాయి. ఎంఎస్‌ఎంఈలు, హౌసింగ్ లోన్లకు తక్కువ రిస్క్ వెయిట్లు ఉండే అవకాశం ఉంది. దీంతో బ్యాంకులకు క్యాపిటల్ అవసరం తగ్గుతుంది.
ఇన్వెస్ట్‌మెంట్ నిబంధనలు: బ్యాంకులు, వాటి గ్రూప్ సంస్థల మధ్య వ్యాపారం, పెట్టుబడులపై ఉన్న పరిమితిని తొలగించారు. స్ట్రాటజిక్ బిజినెస్ కేటాయింపులను బ్యాంక్ బోర్డులు నిర్ణయించవచ్చు.