బెర్తు సరే.. ఆఫీసులెక్కడ?

బెర్తు సరే.. ఆఫీసులెక్కడ?
  • కొత్త మంత్రుల చాంబర్లపై అస్పష్టత
  • తాత్కాలికంగా డీ బ్లాక్‌‌‌‌లోనే కార్యాలయాలు?
  • బీఆర్కేలో ఇంకా మొదలవని మినిస్టర్ల ఆఫీసుల పనులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రి వర్గంలోకి కొత్తగా ఆరుగురు మంత్రులు వచ్చారు గానీ వాళ్లు ఎక్కడి నుంచి పని చేయాలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికే పని చేస్తున్న మంత్రుల చాంబర్లే బీఆర్కే భవన్‌‌‌‌లో రెడీ కాకపోవడంతో కొత్తోళ్ల ఆఫీసులెక్కడో అయోమయం నెలకొంది. తాత్కాలిక సెక్రటేరియెట్‌‌‌‌లో 9 మందికి చాంబర్లు కేటాయించినా ఇంకా ఎవరి చాంబర్ల పనులూ మొదలవలేదు. అక్కడ ఉండేందుకు మినిస్టర్లు ఆసక్తి చూపకపోవడంతోనే రెనోవేషన్‌‌‌‌ పనులు స్టార్టవలేదని తెలుస్తోంది. సెక్రటేరియెట్‌‌‌‌ నుంచి కూడా ఇద్దరు మంత్రుల చాంబర్ల షిఫ్టింగ్‌‌‌‌ పనులే స్టార్టయ్యాయి. 10 రోజుల్లో శాఖల షిఫ్టింగ్‌‌‌‌ పూర్తవుతుందని చెబుతున్నా భవన్‌‌‌‌లో మంత్రుల ఆఫీసుల పనులు మాత్రం ముందుకు కదలడం లేదు.

సెక్రటేరియెట్‌‌‌‌లో 6 చాంబర్లు ఖాళీ

గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన హరీశ్‌‌‌‌రావు చాంబరు డీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌లో, కేటీఆర్‌‌‌‌ల చాంబరు మొదటి ఫ్లోర్‌‌‌‌లో ఉండేవి. రెండోసారి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక వాటిని ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అటవీ మంత్రిగా చేసిన జోగురామన్న, క్రీడా మంత్రిగా చేసిన పద్మారావు చాంబర్లూ ఖాళీగానే ఉన్నాయి.  షిప్టింగ్‌‌‌‌లో భాగంగా రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి ఆఫీసు ఎర్రమంజిల్‌‌‌‌లోని ఈఎన్సీ ఆఫీస్‌‌‌‌కు, దేవదాయ మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి చాంబరు అబిడ్స్ బొగ్గుల కుంటలోని ఆ శాఖ కమిషనరేట్ మారాయి. కాబట్టి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు సరపడ చాంబర్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీళ్లు సెక్రటేరియెట్ డీ బ్లాక్‌‌‌‌లో ఉంటారా లేక బీఆర్కే భవన్‌‌‌‌లో గానీ వాళ్ల శాఖల కమిషనరేట్‌‌‌‌లో గానీ ఉంటారా రెండ్రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

సమావేశాల గ్యాప్‌‌‌‌లో బాధ్యతలు

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెట్టాక జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు సమావేశం అవుతుందో ఖరారు చేస్తారు. మెహర్రం, గణేశ్‌‌‌‌ నిమజ్జనం ఉన్నందున రెండు,  మూడ్రోజులు సమావేశాలకు గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ టైంలోనే కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.