కాలేజీల్లో సీట్లు నిండినా..ఫీజులు తేల్చలె

కాలేజీల్లో సీట్లు నిండినా..ఫీజులు తేల్చలె
  • ఎల్ఎల్​బీ, ఫార్మసీ, బీఈడీ కోర్సుల ఫీజులపై నో క్లారిటీ
  • గత నెలలోనే సర్కారుకు టీఏఎఫ్​ఆర్సీ ప్రతిపాదనలు
  • అయినా ఫీజుల ఖరారు ఉత్తర్వులు ఇవ్వని సర్కారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో పలు కోర్సులకు ప్రభుత్వం ఇంకా ఫీజులను ఖరారు చేయనేలేదు. ఏ కాలేజీలో ఎంత  ఫీజో తెలియకుండానే అడ్మిషన్లు మాత్రం కొనసాగిస్తున్నారు. నిరుటి ఫీజులనే ప్రైవేటు కాలేజీలు వసూలు చేయాలని అధికారులు చెప్తున్నా, మేనేజ్మెంట్లు మాత్రం ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రొఫెషనల్, టెక్నికల్ ఎడ్యుకేషన్​ కోర్సులకు సంబంధించిన కాలేజీల్లో ప్రతి మూడేండ్లకోసారి తెలంగాణ అడ్మిషన్‌‌ అండ్‌‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌‌ఆర్సీ) ఫీజులను నిర్ణయిస్తోంది. గతంలో ఖరారు చేసిన 2019–22  ఫీజుల బ్లాక్​ పీరియడ్​ ముగిసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది. 

2022–25  పీరియడ్​కు సంబంధించి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, బీఆర్, ఎంఆర్క్, ప్లానింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీపీఈడీ, బీపీఈడీ, ఫార్మాడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్ఎల్​బీ, ఎల్ఎల్​ఎం, బీఈడీ, ఎంఈడీతో పాటు పలు కోర్సుల ఫీజుల ఖరారుకు టీఏఎఫ్​ఆర్సీ.. మేనేజ్మెంట్లతో గతంలోనే సమావేశం నిర్వహించింది. కమిటీ నిర్ణయించిన ఫీజుల ప్రతిపాదనలను గతనెల 15న సర్కారుకు పంపించింది. కానీ, ఇప్పటివరకు కేవలం 159  బీటెక్ కాలేజీలు, 76 ఎంటెక్, 238  ఎంబీఏ, 26 ఎంసీఏ కాలేజీల్లో కోర్సులకు సంబంధించిన ఫీజులను మాత్రమే ప్రభుత్వం ఖరారు చేస్తూ జీవోలు రిలీజ్ చేసింది. మిగిలిన కాలేజీలు, కోర్సులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఖరారు కాకున్నా అడ్మిషన్లు.. 

ఏ కాలేజీలో అయినా ఫీజులను బట్టి వాటిలో చేరాలా వద్దా అనేది స్టూడెంట్లు నిర్ణయించుకుంటారు. కానీ, బీఈడీ, ఎంఈడీ, ఎల్ఎల్​బీ, ఎల్ఎల్​ఎం, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీపీఈడీ, బీపీఈడీ... తదితర కోర్సుల్లో  ఫీజు ఎంత అనేది తెలియకుండానే 2022–23 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. గత బ్లాక్ పీరియడ్​లో బీఈడీలో రూ.30,500 నుంచి రూ.36వేల దాకా ఫీజు ఉంది. ఎల్ఎల్​బీలో రూ.18వేల నుంచి 30 వేల వరకు, ఎల్ఎల్​ఎంలో రూ.20వేల నుంచి 35వేలు, బీపీఈడీలో రూ.17వేల నుంచి 25వేలు, డీపీఈడీలో రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజు ఉంది. ఎంఫార్మసీలో రూ.1.20లక్షల వరకు, బీఫార్మసీలో రూ.30వేల నుంచి రూ.90వేలు, ఫార్మాడీలో రూ.68వేల నుంచి రూ.1.30లక్షల వరకు ఉంది. ఒక్కో కాలేజీని బట్టి టీఏఎఫ్​ఆర్సీ గతంలో ఈ ఫీజులను నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు నడుస్తున్నాయి. ఇప్పటికే బీ.ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో దాదాపు సీట్లన్నీ నిండిపోయాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఫీజులపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎల్ఎల్​బీలో టీఏఎఫ్ఆర్సీ 2022–25 పీరియడ్​కు నిర్ణయించిన ఫీజులను వసూలు చేసుకునేలా 8 ప్రైవేటు కాలేజీలు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాయి. స్టూడెంట్లకు అలాట్మెంట్ ఆర్డర్​లోనే ప్రభుత్వం ఇచ్చే జీవో ప్రకారం ఫీజులు పెంచడం, తగ్గడం ఉంటుందనే విషయాన్ని పేర్కొంటున్నాయి.

పాత ఫీజులు వసూలు చేయాలె

కొత్త ఫీజులపై ఇంకా అధికారికంగా ప్రభుత్వం జీవోలు ఇవ్వలేదు. కాబట్టి గతంలో ఉన్న ఫీజులనే కాలేజీలు వసూలు చేయాలి. కొత్త జీవోలు వస్తే, దానికి అనుగుణంగా స్టూడెంట్లు ఫీజులు చెల్లించాలి. ఇదే విషయాన్ని విద్యార్థులకు కాలేజీ అలాట్మెంట్ సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో చెప్తున్నం.
–ప్రొఫెసర్ రమేశ్​ బాబు, అడ్మిషన్ల కన్వీనర్