యాదాద్రి ఓపెనింగ్​పై నో క్లారిటీ

యాదాద్రి ఓపెనింగ్​పై నో క్లారిటీ
  •     ఇంటర్నల్ యాగంపైనా స్పష్టత లేదు
  •     ముహూర్తంపై తీవ్ర చర్చ
  •     ఓపెన్ ​అయినా కొన్ని రోజులు దర్శనాలు బందే!
  •     స్వర్ణ తాపడానికి విరాళాల కొరత

యాదాద్రి, వెలుగు: మహా సుదర్శన యాగం వాయిదా వేయడంతో యాదాద్రి ఆలయ ఓపెనింగ్​అనుకున్న టైంకు ఉంటుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో ఆఫీసర్లు క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే టైంలో ఓపెనింగ్​కు పెట్టిన ముహూర్తం సరిగా లేదనే చర్చ సాగుతోంది. ఆలయ ఓపెనింగ్​సందర్భంగా యాదగిరిగుట్టలో మార్చి 21 నుంచి వారం పాటు సుదర్శన నారసింహయాగం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. మార్చి 28న ఓపెనింగ్​ఉంటుందని చెప్పారు. 1,008 కుండలాలతో నిర్వహించే యాగంలో మొత్తంగా 10 వేల మంది రుత్వికులు పాల్గొంటారని తెలిపారు. ఇందుకోసం 75 ఎకరాల విస్తీర్ణం గల స్థలాన్ని ఎంపిక చేయడంతో పాటు నిధులు కూడా మంజూరు చేశారు. కానీ ఏం జరిగిందో యాగం వాయిదా వేస్తున్నట్టు వైటీడీఏ ఈ నెల 18న ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో అనుమానాలు మొదలయ్యాయి. ఓపెనింగ్ ​సందర్భంగా కచ్చితంగా నిర్వహించాల్సిన సుదర్శన యాగాన్ని ప్రస్తుతం నారసింహుడి కవచ మూర్తులు కొలువై ఉన్న బాలాలయంలోనే అంతర్గతంగా నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే అంతర్గత యాగం నిర్వహణపై కూడా ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. సమయం దగ్గరపడుతున్నా ఈ యాగానికి అవసరమైన వాటిని సమకూర్చుకోవడానికి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని తెలుస్తోంది. సుదర్శన యాగం, ఆలయ ఓపెనింగ్​కు సంబంధించి ముహూర్తం నిర్ణయించిన చినజీయర్​స్వామితో సమావేశం అయితేనే ఏర్పాట్ల విషయంలో క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా? అన్న అనుమానాలు తలెత్తున్నాయి.  యాగం నిర్వహణపై యాదాద్రి టెంపుల్​కు సంబంధించిన ఓ పూజారిని సంప్రదించగా.. ‘ముహూర్తం పెట్టిన చినజీయర్​స్వామి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయం తీసుకోని పక్షంలో ఎవరికో ఒకరికి నిర్ణయాధికారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆలయ ఓపెనింగ్​కు సమయం తక్కువగా ఉన్నందున త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.’ అని  చెప్పారు. 
ముహూర్తంపై సందేహాలు
మార్చి 28న ఆలయ ఉద్ఘాటన(ఓపెనింగ్)కు చినజీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తంపై పండితులు డౌట్స్​ వ్యక్తం చేస్తున్నారు. మార్చి 28 శ్రవణ నక్షత్రంలో ఉందని, ఆలయ ఉద్ఘాటనకు ఇది మంచిది కాదని అంటున్నారు. మంచి రోజులు లేని సమయంలో స్వామివారి ఆలయ ప్రారంభానికి ఏకంగా చినజీయర్ స్వామియే ఎలా ముహూర్తం పెడతారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ముహూర్తంపై ఓ పూజారి మాట్లాడుతూ ‘తల్లి భోజనం పెట్టినప్పుడు అందులో ఏమైనా ఉందా? అని అనుమానపడకండా నమ్మకంతో తినాలి. ముహూర్తం పెట్టింది చినజీయర్ స్వామి కాబట్టి నమ్మాలి. స్వామి వారిని గర్భాలయం నుంచి బయటకు తీసుకొచ్చి ఆరేండ్లవుతోంది. లేటు చేయడం మంచిది కాదు.’అని తెలిపారు.

దర్శనాలు కష్టమే 
ఆలయ ఉద్ఘాటన జరిగినా కొన్ని రోజుల పాటు భక్తులకు స్వయంభూ నారసింహుని దర్శనం లభించే అవకాశం లేదు. ప్రస్తుతం ఆలయ రాజగోపురాల మీద పనులు జరుగుతున్నాయి.   విమాన గోపురంపై పనులు పూర్తి చేసిన తర్వాతే స్వామి వారిని ప్రతిష్టిస్తారు. సప్త గోపురాలపై పనులు ముహూర్తానికి  పూర్తయ్యేలా లేదు. స్క్రాప్​​ను తొలగించేంత వరకూ దర్శనాలు నిలిపివేసే అవకాశం ఉంది.