50 ఏండ్లయినా పరిహారం ఇవ్వరా? : ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

50 ఏండ్లయినా పరిహారం ఇవ్వరా? : ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్  ప్రాజెక్టు నిమిత్తం సేకరించిన భూమికి బాధిత రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసేకరణ చేసి 50 ఏండ్లయినా పరిహారం, పునరావాసం కల్పించకపోవడంపై ఫైర్ అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్  మండలం మగ్గిడికి చెందిన కె.ఎమ్మారెడ్డి పూర్వీకులకు చెందిన ఏడున్నర ఎకరాల భూమి, రెండు ఇళ్లను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిమిత్తం సేకరించారు. ఇందుకు ప్రతిఫలంగా అయిదెకరాల మెట్ట లేదా రెండెకరాల మాగాణి, ఇంటి స్థలాలు అందజేస్తామని ప్రభుత్వం 1975లో జీవో జారీ చేసింది.

జీవో అమలు చేయలేదంటూ ఎమ్మారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సింగిల్  జడ్జి విచారణ చేపట్టారు. రెండు నెలల్లోగా ఆ జీవో అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ  ప్రభుత్వం అప్పీలు పిటిషన్  దాఖలు చేసింది. దీనిని చీఫ్  జస్టిస్  ఉజ్జల్  భూయాన్, జస్టిస్  ఎన్.తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. సింగిల్  జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసి తీరాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.