పరిహారం ఇస్తలేరు.. ప్రాజెక్టులు పూర్తయితలేవు

పరిహారం ఇస్తలేరు.. ప్రాజెక్టులు పూర్తయితలేవు
  • డిండి, ఏఎమ్మార్పీ కింద నిలిచిన భూసేకరణ
  • ఇప్పటికిప్పుడు రూ.500 కోట్లు కావాలన్న ఆఫీసర్లు 
  • ఎక్కడికక్కడ పెండింగ్​లో పనులు 

నల్గొండ, వెలుగు : పాత ప్రభుత్వాలు మధ్యలోనే వదిలేసిన ప్రాజెక్టులు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మొదలుపెట్టిన రిజర్వాయర్లు పూర్తి కావడం లేదు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లాలో 10,286 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో అడుగు ముందుకు పడడం లేదు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగంగా నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లతో పాటు నల్గొండ జిల్లాలో ఏఎమ్మార్పీ కింద నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రూ.500 కోట్లు విడుదల చేస్తేనే సాధ్యమవుతుందని వారం కింద సిద్ధిపేటలో జరిగిన రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ల భేటీలో జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్లు తేల్చిచెప్పారు. భూసేకరణ మధ్యలోనే ఆగిపోవడంతో ప్రాజెక్టుల పనులకు బ్రేక్ పడిందని ఉన్నతాధికారులకు వివరించారు.   

ఆగిపోయిన భూసేకరణ

వేల కోట్లతో ప్రారంభించిన రిజర్వాయర్ల పనులన్నీ భూసేకరణ సమస్యతో మధ్యలోనే ఆగిపోయాయి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగంగా నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో కలిపి 16,334 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 10,875 ఎకరాలు మాత్రమే సేకరించారు. నష్టపరిహారం కింద రూ.466 కోట్లు చెల్లించారు. ఇంకా 5,459 ఎకరాలు తీసుకోవాలి. ఎస్ఎల్బీసీ పరిధిలోని పెండ్లిపాకల రిజర్వాయర్, ఉదయసముద్రం కింద నిర్మించిన బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు కోసం 32,582 ఎకరాలకు 27,755 ఎకరాలు సేకరించారు. ఇంకా 4,827 ఎకరాల సేకరణను పెండింగ్​లో పెట్టారు. నష్టపరిహారం కింద ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చే  రైతులకు ఎకరాకు రూ.5లక్షల వరకు చెల్లిస్తోంది. రైతులు ఒప్పుకోకపోతే జనరల్ అవార్డు కింద రూ. 4లక్షల వరకు ఇస్తున్నారు. అధికారుల అంచనా మేరకు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే 10,286 ఎకరాలకు రూ.514 కోట్ల 30 లక్షలను ప్రభుత్వం రిలీజ్​ చేయాల్సి ఉంటుంది.

మధ్యలోనే ఆగిపోయిన పనులు

భూసేకరణ పూర్తయితేనే రిజర్వాయర్ల పరిధిలో ప్రధాన కాల్వలు, మైనర్లు, సబ్​మైనర్లు కట్టడం వీలవుతుంది. కానీ ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోవడంతో కొన్నేళ్ల నుంచి పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు రిజర్వాయర్ల పనులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆఫీసర్లు బతిమిలాడి ఏదోరకంగా నచ్చజెప్పడంతో తిరిగి మొదలుపెట్టారు. కానీ భూసేకరణ సమస్య కొలిక్కిరాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.  


ఇది డిండి లిఫ్ట్ స్కీం కింద దేవరకొండ ప్రాంతంలో నిర్మించిన గొట్టిముక్కల రిజర్వాయర్. పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటితోనే ఈ రిజర్వాయర్ నిండుతుంది. దీనికింద లింగన్నబావిగూడెం, పోతులరాంతండా గ్రామాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాల్సి ఉంది. రెండు ఊళ్లలోని ఇండ్ల విలువకు లెక్కగట్టి ప్లాట్లు కూడా కేటాయించారు. కానీ 18 ఏండ్లు నిండిన వాళ్లకు ఇవ్వాల్సిన ప్యాకేజీ పెండింగ్​లో ఉంది. పునరావాసం కల్పించి ఊళ్లు ఖాళీ చేయిస్తే ఎగువ ప్రాంతంలోని వాగు నుంచి వచ్చే నీటితోనే ఈ రిజర్వాయర్ నిండి కళకళాడుతుంది. కానీ సర్కారు ఫండ్స్ విడుదల చేయకపోవడంతో నిర్వాసితులు ఊళ్లు ఖాళీ చేయడం లేదు. ఉదయ సముద్రం కింద 2012లో రూ.699 కోట్ల అంచనా వ్యయంతో బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు ప్రారంభించారు. రిజర్వాయర్ కూడా పూర్తయ్యింది. మోటార్లు, పంపుసెట్లు ఇన్​స్టాల్​ చేశారు. అప్రోచ్ ఛానల్ కూడా రెడీ అయ్యింది. కానీ ఈ ప్రాజెక్టు కింద ఇంకా 2,431 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మొత్తం 3,851 ఎకరాలకు ఉమ్మడి ఏపీలో 1436 ఎకరాలు సేకరించారు. మిగతా 2,415 ఎకరాలకు నష్టం పరిహారం రిలీజ్ చేయాలని రెండేండ్ల కింద ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పెట్టారు. దీంట్లో1500 ఎకరాలకు సంబంధించి సర్వే కూడా పూర్తయ్యింది. కానీ ఇప్పటివరకు నయాపైసా విడుదల చేయలేదు.