పోటీ పరీక్షలకు పుస్తకాల్లేవు.. నిరుద్యోగుల తిప్పలు

పోటీ పరీక్షలకు పుస్తకాల్లేవు.. నిరుద్యోగుల తిప్పలు
  • పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అయ్యేటోళ్లకు ఇబ్బంది​
  • ఇంకా మొదలుకాని ప్రింటింగ్.. పేపర్ కొరతే అంటున్న అకాడమీ వర్గాలు

హైదరాబాద్, వెలుగు: వివిధ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కావాల్సిన తెలుగు అకాడమీ బుక్స్ ఎక్కడా దొరకడం లేదు. గతంలో గ్రూప్​ 1, గ్రూప్​ 2, గ్రూప్​ 3 ఎగ్జామ్స్​ కోసం ప్రింట్​ చేసిన పుస్తకాల పాత స్టాక్​ ఇప్పటికే పూర్తి స్థాయిలో అమ్ముడవడంతో.. కొత్తగా ప్రింట్​ చేస్తేగానీ అభ్యర్థులకు స్టాండర్డ్ మెటీరియల్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడక్కడ ప్రైవేట్​ పబ్లిషర్స్​ బుక్స్​ తప్ప తెలుగు అకాడమీ బుక్స్​ లభించడం లేదు. 
అకాడమీ బుక్స్​కు ఫుల్ డిమాండ్ 
గ్రూప్- 1, గ్రూప్ -2, గ్రూప్ -3లాంటి పరీక్షల కోసమని భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, రాజ్యాంగం, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర తదితర పుస్తకాలను తెలుగు అకాడమీ అందుబాటులోకి తెచ్చింది. తెలుగు సాహిత్యం, భూసంస్కరణలపై క్వశ్చన్ బ్యాంకులు రూపొందించింది. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ చరిత్ర- – సంస్కృతి, తెలంగాణ ఉద్యమం, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక చరిత్ర, జనరల్ స్టడీస్ వంటి పుస్తకాలను తయారుచేసింది. ఈ పుస్తకాలన్నింటికీ  మార్కెట్​లో ఫుల్ డిమాండ్ ఉంది. కానీ బుక్ స్టాళ్లలో, తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రాల్లో ఇవి దొరకకపోవడంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. 
పేపర్​ కొరతే కారణమా..!
ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పడంతో తెలుగు అకాడమీ కూడా బుక్స్​ పబ్లిషింగ్​కు సంసిద్ధంగా ఉండాల్సింది. అయితే అకాడమీకి పూర్తి స్థాయి డైరెక్టర్​ లేకపోవడంతో బుక్స్​ ప్రింటింగ్ పై నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యం జరిగినట్లు తెలిసింది. సాధారణంగా బుక్స్​ ప్రింట్​ చేసే సంస్థలకు తెలుగు అకాడమీనే సంస్థ లోగో బ్యాక్​ గ్రౌండ్ లో కనిపించేలా రూపొందించిన పేపర్​ను అందజేస్తుంటుంది. పైరసీ సమస్య రాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పేపర్​ కోసం నిరుడు సెప్టెంబర్​లో టెండర్లు పిలవగా.. ఒక్కరే టెండర్​ వేసినట్లు తెలిసింది. రెండు వారాల కిందట్నే ఈ టెండర్​ను  ఫైనల్ చేసి వర్క్​ ఆర్డర్​ పెట్టినట్లు సమాచారం. పేపర్​ రావడానికి మరో 15 రోజులు పట్టొచ్చని, బుక్స్​ ప్రింటయ్యి మార్కెట్ లోకి  రావడానికి నెల రోజులు పట్టొచ్చని అకాడమీ వర్గాలు చెప్తున్నాయి.