
- మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం
- వైస్ చైర్మన్లకు పొంచి ఉన్న ముప్పు
- హెచ్ఎండీఏ పరిధిలోనే ఆరు చోట్ల
- 36 పాలక మండళ్లపై నో కాన్ఫిడెన్స్
- బీఆర్ఎస్ సర్కారు కొత్త చట్టంపై సంతకం చేయని గవర్నర్
- పాతదే అమల్లో ఉంటుందంటున్న హైకోర్టు
- మూడేళ్లు పూర్తవడంతో నో కాన్ఫిడెన్స్ లు
హైదరాబాద్: 29 బల్దియాల్లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్లు, అరడజన్ మంది వైస్ చైర్ పర్సన్లకు పదవీగండం పొంచి ఉంది. 12 మున్సిపాలిటీల్లో వచ్చే పది రోజుల్లో అవిశ్వాసంపై బలనిరూపణ సమావేశాలు నిర్వహించేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లోర్ టెస్ట్ తర్వాత ఈ మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ వశమయ్యే అవకాశం ఉంది.
జనవరితో మూడేళ్లు పూర్తవుతుండటంతో రాష్ట్రంలో 36 మున్సిపాలిటీలు అవిశ్వాసం బాటపట్టాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వినీతా పవన్ పై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టి విజయం సాధించారు. నిన్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో అవిశ్వాసానికి బలనిరూపణ పరీక్ష జరగాల్సి ఉండగా హైకోర్టు స్టేతో నిలిచిపోయింది.
వరంగల్ జిల్లా నర్సంపేట లో 8న, 12న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, నస్పూర్, 12న సిద్దిపేట జిల్లా చేర్యాలలో, 20న ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ బల్దియాల్లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు భూపాలపల్లి, వర్ధన్నపేట, నారాయణఖేడ్, నేరుడుచర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరి గుట్ట, చౌటుప్పల్, కొస్గి తదితర పట్టణాల్లో అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలోనే ఆరు చోట్ల
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో జవరహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యను గద్దె దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
దీంతోపాటు మేడ్చల్, పెద్ద అంబర్‌పేట్, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, ఆదిభట్ల, నాగారం బల్దియాల్లో చైర్ పర్సన్లపై అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు అధికారులకు 36 బల్దియాలు, కార్పొరేషన్లకు సంబంధించిన అవిశ్వాస నోటీసులు అందాయి.
కొందరు చైర్ పర్సన్లు, మేయర్లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. సవరించిన చట్టాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించనందున, పాత చట్టం (మూడేళ్ల పదవీకాలం) అమలులో ఉంటుందని హైకోర్టు చెబుతోంది.