బెడ్ కన్ఫర్మ్ లేకపోతే తెలంగాణలో అడుగు పెట్టనివ్వం

బెడ్ కన్ఫర్మ్ లేకపోతే తెలంగాణలో అడుగు పెట్టనివ్వం

హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల నుంచి మన స్టేట్‌లోకి వస్తున్న కరోనా పేషెంట్ల అంబులెన్స్‌‌లను తెలంగాణ పోలీసులు రానివ్వడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో బెడ్‌‌ల కొరత ఏర్పడటంతో బార్డర్ వద్దే ఏపీతో సహా ఇతర స్టేట్‌‌ల నుంచి వస్తున్న అంబులెన్స్‌లను నిలిపి వేస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్‌లు కన్ఫర్మ్ అయిన వారినే అనుమతిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

‘పొరుగు రాష్ట్రాల నుంచి చాలా మంది పేషెంట్లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌‌కు వస్తున్నారు. కానీ హాస్పిటల్స్‌లో బెడ్‌‌లు కన్ఫర్మ్ అయిన వారినే రానిస్తున్నాం. బెడ్ కన్ఫర్మ్ కాని వారు ఆస్పత్రుల బయట ఎదురు చూడాల్సి వస్తోంది. కాబట్టి బెడ్‌లు కన్ఫర్మ్ అయితేనే తెలంగాణలోకి రానిస్తున్నాం’ అని ఓ సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. ప్రతిరోజూ అన్ని చెక్ పాయింట్లలో కలిపి ఇతర రాష్ట్రాల నుంచి 500 వరకు కరోనా పేషెంట్లతో ఉన్న అంబులెన్స్‌లు తెలంగాణలోకి వస్తున్నాయని సమాచారం. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో దాదాపు 50 శాతం వరకు పొరుగు రాష్ట్రాల కరోనా రోగులతో నిండిపోయాయని రీసెంట్‌గా ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు.