న్యూ ఇయర్‌‌‌‌కు కరోనా ఆంక్షలు లేనట్టే!

న్యూ ఇయర్‌‌‌‌కు  కరోనా ఆంక్షలు లేనట్టే!
  • ఇప్పటి వరకు కంట్రోల్​లోనే కేసులు
  • మాస్కులు పెట్టుకుంటేనే మంచిదంటున్న ఆరోగ్యశాఖాధికారులు

హైదరాబాద్, వెలుగు: ఈ సారి న్యూ ఇయర్ వేడుకలకు కరోనా ఆంక్షలేమి ఉండవని తెలుస్తోంది. కేసులు కంట్రోల్‌‌ లోనే ఉన్నందున, సెలబ్రేషన్స్​ పై రిస్ట్రిక్షన్స్‌‌ పెట్టాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రస్తుతం వైరల్ సీజన్ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కర్నాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ రెండు రోజుల క్రితం ఇలాంటి ఓ అడ్వైజరీనే విడుదల చేసింది. న్యూ ఇయర్ వేడుకలపై ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదని అందులో పేర్కొంటూనే.. ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వ్యక్తులు ఇంట్లోనే ఉండడం మంచిదని సూచించింది. 

దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు జన సమూహంలోకి వెళ్లకూడదని సూచించింది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారి విషయంలో న్యూఇయర్ వేడుకల నిర్వాహకులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పార్టీలకు వచ్చే వారి కోసం మాస్కులు, సానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. కర్నాటకలో జేఎన్‌‌.1 వేరియంట్ కేసులు 34 నమోదయ్యాయి. అయితే, ఈ వేరియంట్ ప్రమాదకరం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినందున, ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ నోట్‌‌లో పేర్కొంది.

కరోనా బులెటిన్ బంద్!

రాష్ట్రంలో రెండ్రోజుల క్రితం వరకు రోజూ 10 నుంచి 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కేసుల వివరాలను రెండ్రోజులుగా ఆరోగ్యశాఖ ప్రకటించడం లేదు. జిల్లాల వారీగా చేసిన టెస్టులు.. నమోదైన కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య తదితర వివరాలతో ఇచ్చే  కరోనా డెయిలీ బులెటిన్‌‌ విడుదలనూ ఆపేశారు. ఇకపై తాము బులెటిన్లు ఇవ్వబోమని, ఏదైనా సమాచారం కావాలంటే ప్రభుత్వమే అధికారంగా ప్రకటిస్తుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్‌‌ మీడియాకు తెలిపారు. 

కానీ, ప్రభుత్వం కూడా రెండ్రోజుల నుంచి బులెటిన్ ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గురించి ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్టు, లాక్‌‌డౌన్ పెట్టబోతున్నట్టు సోషల్ మీడియాలో ఊహాగానాలతో కూడిన కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి. కేసుల సంఖ్యను అధికారికంగా వెల్లడించకపోవడంతో, జనాలను భయాందోళనకు గురిచేసే సోషల్ మీడియా పోస్టులే ఎక్కువగా ఫోకస్ అయ్యే ప్రమాదం ఉందని పలువురు డాక్టర్లు చెబుతున్నారు.