నిఠారీ వరుస హత్యల కేసులో 13వ బాలిక హత్య కేసు నిందితుడిని నిర్ధోషిగా ప్రకటించిన కోర్టు

నిఠారీ వరుస హత్యల కేసులో 13వ బాలిక హత్య కేసు నిందితుడిని నిర్ధోషిగా ప్రకటించిన కోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 19 మంది బాలికలు, మహిళల హత్య కేసులో 13వ బాలిక హత్య కేసులో నిందితుడైన సురేంద్ర కోలి ని విడుదల చేయాలని  2025 నవంబర్ 11 న కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు తనపై ఉన్న 12 కేసుల నుంచి  బయటపడిన కోలి.. చివరి కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో నిర్దోషిగా విడుదల కాబోతున్నాడు. 

పిటిషనర్ పైన ఉన్న అన్ని ఛార్జెస్ తొలగించి విడుదల చేయాల్సిందిగా చీఫ్ జస్టిస్ బీ.ఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ లతో కూడిన ధర్మాసనం.. పిటిషనర్ ను విడుదల చేయాల్సిందిగా సూచించింది. 

నిఠారీ వరుస హత్యల కేసు ఏంటి?

2006లో నోయిడాలోని నిఠారీ గ్రామంలో వరుస హత్యలు సంచలనం సృష్టించాయి. గ్రామంలోని మానిందర్‌ సింగ్‌ పంధేర్‌ అనే వ్యాపారవేత్త ఇంటి సమీపంలోనే ఒక మురికి కాలువలో డిసెంబర్ 29వ తేదీన కొన్ని మానవ అవశేషాలు కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురై, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు.. పంధేర్‌ ఇంటి వెనుక పెరట్లో అనేక మంది చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు గుర్తించారు. 2005-2006 మధ్యకాలంలో ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులకు సంబంధించినవి అని విచారణలో తేలింది.

►ALSO READ | కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోడీ రియాక్షన్

ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో.. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. పంధేర్‌ ఇంట్లో పనిచేసే సురేందర్‌ కోలీ.. స్థానిక చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లేవాడని తేలింది. ఈ తర్వాత వాళ్లను దారుణంగా హత్య చేసి, ఆపై మృతదేహాలపై లైంగిక దాడికి పాల్పడేవాడని నిర్ధారణ అయ్యింది. అప్పట్లో ఈ ఘటనకు సంబంధించి ఆ ఇద్దరిపై 19 కేసులు నమోదు చేశారు. పంధేర్‌ కొన్ని కేసుల్లో నిర్దోషిగా తేలినా, రెండు కేసుల్లో కోలీ దోషిగా తేలడంతో అతనికీ ఉరిశిక్ష విధించింది.

మరణ శిక్ష ఎలా రద్దు అయ్యింది?

తమకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ కోలీ (12 కేసులు), పంధేర్ (2 కేసులు) అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై కోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. చివరికి  న్యాయస్థానం తన తుది తీర్పుని వెల్లడిస్తూ.. ఆ ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. 14 కేసుల్లో ఆ ఇద్దరికీ వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడం వల్లే నిర్దోషులుగా ప్రకటించినట్టు కోర్టు తెలిపింది. అయితే.. ఈ తీర్పుపై సీబీఐ సంతృప్తిగా లేదు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.