జాహ్నవి మృతి కేసులో పోలీసుపై నో క్రిమినల్ చార్జెస్

జాహ్నవి మృతి కేసులో పోలీసుపై నో క్రిమినల్ చార్జెస్

వాషింగ్టన్: అమెరికాలో ఏపీకి  చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్‌‌పై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ ఆఫీస్ బుధవారం ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో  విచారించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. అయితే, జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు ఆఫీసర్ డేనియల్ అడెరెర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. బాధితురాలిపై అడెరెర్ కామెంట్స్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

 అతని ప్రవర్తన ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఉందన్నారు. అడెరెర్ పై తీసుకోబోయే క్రమశిక్షణా చర్యల ప్రభావం డేవ్ పై అభియోగాలు మోపొద్దనే నిర్ణయంపై ఉండదని చెప్పారు. ఇప్పటికే అడెరెర్ పై సస్పెన్షన్ వేటుపడింది. అతనిపై తుది విచారణ మార్చి 4న కోర్టు ముందుకు రానుంది. కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏండ్ల కందుల జాహ్నవి.. 2023 జనవరిలో సియాటెల్ లో  పోలీసు పెట్రోలింగ్ వెహికల్ ఢీకొని మృతిచెందింది. నిందితులలో ఒకరైన పోలీసు ఆఫీసర్ డేనియల్ అడెరెర్.. జాహ్నవిని ఉద్దేశించి నవ్వుతూ చులకనగా మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. 'ఆమె చావుకు విలువే లేదు' అన్నట్లుగా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.