
- ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ఉత్తర్వులు అందలేదు: రవాణా శాఖ
- ఆ నంబర్ ప్లేట్లు లేకుంటే ఫైన్లు వేయబోమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్‌పీ) తప్పనిసరి కాదని, దీనికి సంబంధించి ఎలాంటి గడువు విధించలేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్ఎస్ఆర్ పీ నంబర్ ప్లేట్లు లేకుంటే ఆర్టీఏ అధికారులుగానీ, ట్రాఫిక్ పోలీసులుగానీ ఎలాంటి ఫైన్ లు వేయరని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆ నంబర్ ప్లేట్లకు సంబంధించిన ఎలాంటి గడువు ఉత్తర్వులూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు అందలేదని వెల్లడించారు.
ఈ విషయం ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో మాత్రమే ఉందని, వాహనదారులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే.. హెచ్ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్లను బిగిస్తామని వెబ్‌సైట్లలో కొందరు ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి వాటిని వాహనదారులు నమ్మరాదని హెచ్చరించారు. అలాగే ఆర్టీఏ చలాన్ల పేరిట వచ్చే అనుమానాస్పద లింక్ లను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని సూచించారు.