దూరవిద్య పరీక్షలు ఆగమాగం

దూరవిద్య పరీక్షలు ఆగమాగం

గందరగోళంలో కేయూ ఎస్డీఎల్ సీఈ స్టూడెంట్లు
8 నుంచి కేవలం ఫైనల్ ​ఇయర్​వాళ్లకే ఎగ్జామ్స్​
ఫస్ట్​, సెకండ్​ ఇయర్​కు​ పోస్ట్​పోన్​ ఆఫీసర్ల తీరుతో
సఫర్​ అవుతున్న స్టూడెంట్లు

వరంగల్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ ఎస్డీఎల్​సీఈ(స్కూల్​ ఆఫ్​డిస్టెన్స్​లెర్నింగ్​అండ్​ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్​) పరీక్షల నిర్వహణ అంతా గందరగోళంగా మారింది. పక్కా ప్రణాళిక ప్రకారం ఎగ్జామ్స్​కండక్ట్​ చేయాల్సిన ఆఫీసర్లు అయోమయం సృష్టిస్తుండటంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే రెండుసార్లు పరీక్షలను వాయిదా వేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 8 నుంచి కేవలం ఫైనల్​ఇయర్​స్టూడెంట్స్​కు మాత్రమే ఎగ్జామ్స్ పెట్టేందుకు ఆఫీసర్లు సిద్ధమయ్యారు. ఫస్ట్, సెకండ్​ఇయర్​స్టూడెంట్లకు పరీక్షలు మళ్లీ పోస్ట్​ పోన్​ చేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు.

ఏడాదిగా వాయిదాలే..

ఎస్డీఎల్ సీఈలో 2018–-19 అకడమిక్ ఇయర్​లో యూజీసీ రూల్స్​కు విరుద్ధంగా అడ్మిషన్లు చేశారనే కారణంతో ఎగ్జామ్స్​పోస్ట్​పోన్​ చేస్తూ వచ్చారు. వారంతా ఇప్పటికే ఏడాది విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. ఆ తరువాత బ్యాచ్​లలో అడ్మిషన్లు చేపట్టగా..  దాని ప్రకారం ఎస్డీఎల్​సీఈలో దాదాపు 40వేల మంది స్టూడెంట్లు ఉన్నారు. వీరికి గత మార్చిలో డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్​జరగాల్సి ఉండగా.. కరోనా, లాక్​ డౌన్​ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఫస్ట్, సెకండ్​ఇయర్​ స్టూడెంట్లు విద్యా సంవత్సరం లాస్​ కావద్దనే ఉద్దేశంతో పై తరగతులకు ప్రమోట్​చేశారు. ఈ మేరకు ప్రమోట్​అయిన స్టూడెంట్లు రెండు నెలల తేడాతో రెండు సంవత్సరాల ఎగ్జామ్స్​ రాయాల్సి ఉంటుంది. 2020 డిసెంబర్​లో ఎగ్జామ్స్​ నిర్వహించేందుకు ప్లాన్​చేసినప్పటికీ  వివిధ కారణాలతో జనవరి 20 నుంచి పరీక్షలు పెట్టేందుకు టైం టేబుల్​రిలీజ్​చేశారు. కానీ ఎగ్జామ్ సెంటర్ల విషయం క్లారిటీ రాకపోవడంతో ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు. అదీ కేవలం డిగ్రీ, పీజీ ఫైనల్​ఇయర్​స్టూడెంట్స్​కు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఫస్ట్​, సెకండ్​ఇయర్​ స్టూడెంట్లకు ఏడాదికాలంగా ఎదురుచూపులే దిక్కవుతున్నాయి. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక అంతా గందరగోళంలో పడ్డారు.

చివరి నిమిషంలో హడావుడి

ఫిబ్రవరి 8 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. 7న సండే కావడంతో శనివారమే హాల్​టికెట్ల కోసం స్టూడెంట్లు మొబైల్​లో వెతకడం, మీ సేవా కేంద్రాలను సంప్రదించడం చేశారు. కానీ అప్డేట్​సమాచారం ఏమీ లేకపోవడంతో హైదరాబాద్, నల్గొండ, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఆఫీస్​లో సంప్రదించడం ప్రారంభించారు. ఒక్కొక్కరిగా ఆఫీస్​కు వస్తున్న వారి  సంఖ్య
పెరిగిపోవడంతో ఆఫీసర్లు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హడావుడిగా ఫస్ట్, సెకండ్​ఇయర్​పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు స్టూడెంట్ల ఫోన్లకు మెసేజ్​ పంపించారు. ఇక ఫైనల్​
ఇయర్​హాల్​ టికెట్లను మధ్యాహ్నం 3 గంటల టైంలో
అప్ లోడ్​ చేశారు. ఎస్డీఎల్​సీఈ, కేయూ ఎగ్జామినేషన్​ కంట్రోలర్​ మధ్య సమన్వయం లేకనే ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కడెక్కడో సెంటర్లు

కేయూ ఎస్డీఎల్​సీఈ పరిధిలో 2019–-20 విద్యా సంవత్సరం వరకు రాష్ట్ర వ్యాప్తంగా160 స్టడీ సెంటర్లు ఉండేవి. కానీ 2020–-21 విద్యా సంవత్సరం నుంచి యూజీసీ గైడ్​ లైన్స్​ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 110 ఎత్తేసి,  కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్​ జిల్లాల్లోని కేవలం 50 స్టడీ సెంటర్లు మాత్రమే కొనసాగిస్తున్నారు. ఫైనల్​ఇయర్​స్టూడెంట్లకు స్టడీ సెంటర్ల నుంచి 50 కిలో మీటర్ల పరిధిలో ఎగ్జామ్ సెంటర్​ కేటాయించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ మేరకు గతంలో ఉండే 110 సెంటర్లను ఇప్పుడు 30 కుదించారు. దీంతో చాలామంది స్టూడెంట్లకు దూరాభారం ఎక్కువైంది. శనివారం సాయంత్రం హాల్​ టికెట్లు ఇష్యూ చేయగా.. వనపర్తి జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్​కు ఖమ్మం జిల్లాలో సెంటర్​ వేశారు. దీంతో దాదాపు 250 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆ స్టూడెంట్​ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అప్పటికప్పుడు మళ్లీ సెంటర్​ మార్చే ప్రయత్నాలు చేపట్టారు. హైదరాబాద్​లో ఉండే స్టూడెంట్​కు జనగామలో సెంటర్​ వేశారు. ఎలాంటి ప్లాన్​లేకుండా చివరి నిమిషంలో హాల్​ టికెట్లు ఇష్యూ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సెంటర్​ దూరం వేసిన్రు

హైదరాబాద్​లో ఉంటూ డిస్టెన్స్​లో డిగ్రీ చదువుతున్నా. ఇప్పుడు నాకు జనగామలో సెంటర్​ వేశారు. భువనగిరిలోనే సెంటర్​ ఉన్నా అక్కడ వేయకుండా చాలా దూరం వేశారు. దీనిపై అభ్యంతరం కూడా చెప్పే వీలు లేకుండా శనివారం సాయంత్రం సెంటర్లు డిక్లేర్​చేసి హాల్​టికెట్లు ఇష్యూ చేశారు. మాలాంటి వాళ్లకు దగ్గర్లోని సెంటర్లు కేటాయిస్తే పరీక్షకు హాజరయ్యేందుకు అనుకూలంగా ఉంటుంది.

– జివిలికపల్లి వెంకటేశ్, భువనగిరి

మళ్లీ ఎప్పుడో చెప్పడం లేదు

మా బాబు ఎస్డీఎల్​సీఈలో డిగ్రీ ఫస్ట్​ ఇయర్​చదువు తున్నాడు. ఎగ్జామ్స్​పోస్ట్​ పోన్​అయినప్పుడు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. యూనివర్సిటీ సైట్​లో కూడా ఎలాంటి సమాచారం లేక పరీక్ష దగ్గర పడుతోందని శనివారం ఉదయం నేరుగా ఆఫీస్​కు వచ్చాను. ఇక్కడి ఆఫీసర్లు డిగ్రీ ఫస్ట్​ఇయర్, సెకండ్​ఇయర్​పరీక్షలు వాయిదా వేసినట్లు చెప్పారు. కానీ మళ్లీ ఎప్పుడు పెడతారో చెప్పడం లేదు. ఇప్పటికే మూడుసార్లు హైదరాబాద్​ నుంచి వచ్చా. ముందుగా సమాచారం ఇవ్వకపోవడం వల్ల సమయంతో పాటు ఛార్జీలు లాస్​ కావాల్సి వస్తోంది.

‌‌‌‌- శామ్యూల్, స్టూడెంట్​ తండ్రి, హైదరాబాద్​

త్వరలోనే మిగతా వాళ్లకూ ఎగ్జామ్స్​

2018–-19 బ్యాచ్​ స్టూడెంట్లకు వీసీ అనుమతితో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఫైనల్​ ఇయర్​ ఎగ్జామ్స్​కండక్ట్​చేస్తున్నాం. వీరికి బ్యాక్​లాగ్స్​ రాసే అవకాశం కూడా కల్పించాం. ఆ తరువాత ఫస్ట్​, సెకండ్​ ఇయర్ పరీక్షలకు షెడ్యూల్​ ఖరారు చేస్తాం. త్వరలోనే ఎగ్జామ్స్​ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ఎగ్జామ్​ సెంటర్లు 50 కిలోమీటర్ల పరిధిలోపు కేటాయించాం. దగ్గర్లో సెంటర్లు లేనివారికి మాత్రమే కొంచెం దూరంలో వేయాల్సి వచ్చింది.  – మహేందర్​రెడ్డి, కేయూ ఎగ్జామినేషన్​ కంట్రోలర్