
సాధారణంగా గుండెపోటు వస్తే ఛాతినొప్పి, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మనందరికి తెలుసు.. అయితే ఎటువంటి లక్షణాలు లేని హార్ట్ అటాక్ కూడా ఉందని బాంబ్ పేల్చారు డాక్టర్లు. హార్ట్ అటాక్ లు ఐదు రకాలుగా ఉంటాయని..వాటిలో ఒక రకం హార్ట్ అటాక్ ఎటువంటి సింప్టమ్స్ లేకుండానే వస్తుందని..ఇది చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. మరి ఇటువంటి హార్ట్ అటాక్ ను ముందుకు ఎలా గుర్తించాలి..ఏవిధమైన టెస్టుల ద్వారా ఈ రకం గుండెపోటును గుర్తించవచ్చు. వంటి అంశాల గురించి ఓ ప్రముఖ డాక్టర్ ఇటీవల తన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు.. ఫుల్ డిటెయిల్స్లోకి వెళితే..
ప్రముఖ డాక్టర్ శ్రీరామ్ నూనె ది రణవీర్ షో పాడ్ కాస్ట్ లో ఓ భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. గుండెపోటులు ఐదు రకాలుంటాయని.. వాటిలో ఒకటి ఎటువంటి సంకేతాలు లేకుండానే అటాక్ అవుతుందని చెప్పారు. దీనిని సైలెంట్ హార్ట్ అటాక్ అని పిలుస్తారని చెబుతున్నారు. సైలెంట్ హార్ట్ అటాక్ (Silent Heart Attack) అంటే గుండెపోటు వచ్చినప్పటికీ, సాధారణ గుండెపోటులో కనిపించే తీవ్రమైన ఛాతీ నొప్పి వంటి స్పష్టమైన లక్షణాలు ఏవీ కనిపించవు. దీనిని "సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్" అని కూడా పిలుస్తారు. దీని లక్షణాలు చాలా తేలికపాటిగా లేదా వేరే సమస్యగా పొరబడే విధంగా ఉంటాయని అంటున్నారు. లేదా అస్సలు కనిపించకపోవచ్చు. అందువల్ల దీనికి గుర్తించడం కష్టం అంటున్నారు.
సైలెంట్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది?
సైలెంట్ హార్ట్ అటాక్ సాధారణ గుండెపోటుకు కారణమయ్యే అవే కారణాల వల్ల వస్తుంది. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు (కరోనరీ ధమనులు) అడ్డుపడటం వల్ల గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఈ అడ్డంకి సాధారణంగా ధమనులలో కొవ్వు ,కొలెస్ట్రాల్ నిక్షేపాలు (ప్లాక్) పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ ప్లాక్ విరిగిపోయి రక్తం గడ్డకట్టడానికి దారితీసినప్పుడు, అది రక్త ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. ఫలితంగా గుండెపోటు వస్తుందంటున్నారు డాక్టర్లు. కొన్ని కొన్నిసార్లు గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే కరోనరీ ఆర్టరీ స్పామ్ అంటే అకస్మాత్తుగా సంకోచించడం కూడా రక్త ప్రవాహాన్ని అడ్డుకుని గుండెపోటుకు కారణం కావచ్చంటున్నారు.
సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణాలు..
సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి.ఇతర సాధారణ సమస్యలుగా భావించేలా ఉంటాయంటున్నారు డాక్టర్లు. ఛాతీలో తేలికపాటి అసౌకర్యం లేదా నొప్పిలా అనిపిస్తుంది. ఇది సాధారణ గుండెపోటులో లాగా తీవ్రమైన నొప్పి కాకుండా ఛాతీ మధ్యలో ఒత్తిడి, బిగుతు లేదా మంటగా అనిపించవచ్చు. ఇది వచ్చి వెళ్లిపోవచ్చు. ఇటువంటి లక్షణాలు అజీర్తి, గ్యాస్ లేదా కండరాల నొప్పితో ఉన్నప్పుడు కూడా కనిపిస్తాయి. అందుకే గుండెపోటు కాదు అని భ్రమించేలా ఈ లక్షణాలుంటాయంటున్నారు డాక్టర్ నూనె.
చిన్నపాటి పని చేసినా లేదా ఎలాంటి కారణం లేకుండానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.
విపలరీతమైన అలసట లేదా బలహీనత..ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ఒత్తిడి లేదా నిద్రలేమి లక్షణాలుగా కూడా మనం పొరపాటుగా భావించే అవకాశం ఉంటుందన్నారు.
గుండెల్లో మంట, అజీర్ణం, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలు సైలెంట్ హార్ట్ అటాక్ సింప్టమ్స్ గా ఉంటాయంటున్నారు. ఇవి కడుపుకు సంబంధించిన సమస్యలుగా కూడా భావిస్తారు.
శరీరంలోని ఇతర ప్రాంతాల్లో నొప్పి.. నొప్పి ఛాతీకి మాత్రమే పరిమితం కాకుండా దవడ, మెడ, వీపులో ముఖ్యంగా భుజాల మధ్య ఎడమ చేయి లేదా కడుపు వరకు నొప్పిగా అనిపించొచ్చంటున్నారు.
తలతిరగడం లేదా మైకం..రక్త ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల మైకం లేదా కళ్లు తిరిగినట్లు అనిపించవచ్చంటున్నారు డాక్టర్ నూనె.
చల్లని చెమటలు: శారీరక శ్రమ లేకుండానే లేదా ఆందోళన లేకుండానే చల్లని చెమటలు పట్టడం.
సైలెంట్ హార్ట్ అటాక్ నిర్ధారణ ,చికిత్స
సైలెంట్ హార్ట్ అటాక్ తరచుగా రెగ్యులర్ హెల్త్ చెకప్‌లలో ముఖ్యంగా ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) లేదా ఎకోకార్డియోగ్రామ్ వంటి పరీక్షలలో అనుకోకుండా బయటపడుతుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ గుండె కండరాలకు నష్టం కలిగిస్తుంది. అది ఈ పరీక్షలలో స్పష్టంగా కనిపిస్తుంది.
సైలెంట్ హార్ట్ అటాక్ నిర్ధారణ అయిన తర్వాత చికిత్స సాధారణ గుండెపోటుకు అందించే చికిత్స లాగానే ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఇందులో మందులు, జీవనశైలి మార్పులు, అవసరమైతే యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ వంటి విధానాలతో చికిత్స చేస్తామని చెబుతున్నారు డాక్టర్లు.
తీసుకోవలసిన జాగ్రత్తలు..
సైలెంట్ హార్ట్ అటాక్‌ను నివారించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పలు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం అంటున్నారు డాక్టర్లు.
ఆరోగ్యకరమైన ఆహారం: కొవ్వు పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం: ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు.
బరువు అదుపు: ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయాలంటున్నారు డాక్టర్లు.
రక్తపోటు ,మధుమేహ కంట్రోల్.. మీకు హైబీపీ లేదా డయాబెటిస్ ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడాలి ,వైద్యుల సలహాలు పాటించాలంటున్నారు.
మందు అలవాటు, పొగతాగడం వంటి అలవాట్లుఉంటే వెంటనే మానేయాలంటున్నారు
ఒత్తిడిని తగ్గించుకోవాలంటున్నారు డాక్టర్లు. ఒత్తిడిని నియంత్రించడానికి యోగా, ధ్యానం వంటివి చేయవచ్చు.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు: ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వారు, గుండె సమస్యల ప్రమాదం ఉన్నవారు క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ECG వంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలంటున్నారు.
పైన పేర్కొన్న లక్షణాలలో ఏవి కనిపించినా లేదా గుండె ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చంటున్నారు డాక్టర్లు.