- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సాధ్యం కాని పేదోడి సొంతింటి కలను.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నెరవేర్చి చూపించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ఆదివారం తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో మార్క సంధ్య వెంకటేశ్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని పట్టుబట్టలు పెట్టి, యాటపోతును కానుకగా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలేరునియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలో ఆలేరును ఫస్ట్ ప్లేస్ లో నిలుపుతామని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని బీఆర్ఎస్ పదేళ్లుగా మోసం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కట్టించి పేదోడికి గూడు కల్పించిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలేరులో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తాము కొత్తగా 7,680 కొత్త రేషన్ కార్డులు, 18,600 కొత్త యూనిట్లు ఇచ్చిమొత్తం 45 వేల యూనిట్లకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. తిర్మలాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
