కూతురి పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక.. పురుగుల మందు తాగిన ముగ్గురు కూతుళ్ల తండ్రి

కూతురి పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక.. పురుగుల మందు తాగిన ముగ్గురు కూతుళ్ల తండ్రి

కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధతో ముగ్గురు కూతుళ్ల తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలిచివేస్తోంది.  కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు ఓ వైపు.. మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాలనే మనోవేదన మరో వైపు.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన ఘటన  గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.

ALSO READ | జడ్చర్ల పట్టణంలో ఇద్దరు యువతులు మిస్సింగ్

కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్య -సుగుణ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు శృతి వివాహం గత ఐదు సంవత్సరాల క్రితం అయ్యింది.  మిగతా ఇద్దరు కూతుళ్లు పల్లవి ,అక్షయ చదువుకుంటున్నారు. పెద్ద కూతురు శృతి వివాహానికి దాదాపు ఆరు లక్షల అప్పు చేశాడు సమ్మయ్య . సమ్మయకు మూడెకరాల బీడు భూమి ఉంది .ఇదే భూమిలో వ్యవసాయం చేస్తూ కూలి పనులకు వెళ్లేవాడు. ఇలా  వచ్చిన డబ్బులతో అప్పు తీరకపోగా.. మరో ఇద్దరు కూతుళ్ల వివాహం ఎలా చేయాలనే  మనస్థాపంతో  జూన్  29 న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. 

 వెంటనే   కుటుంబ సభ్యులు వరంగల్ ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా చికిత్స పొందుతూ జులై 8న  మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.  కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టి అంతక్రియలు పూర్తి చేసింది. ముగ్గురు కూతుళ్లు తండ్రి కోసం ఏడుస్తున్న ఘటన  గ్రామస్థులందర్నీ  కంటతడి పెట్టిస్తోంది.