Rashmika Mandanna: రష్మికపై నిప్పులు చెరిగిన కొడవ నటీనటులు.. అసలేం జరిగింది?

Rashmika Mandanna: రష్మికపై నిప్పులు చెరిగిన కొడవ నటీనటులు..  అసలేం జరిగింది?

నేషనల్ క్రష్ , యువ నటి ' రష్మిక మందన్న' ( Rashmika Mandanna )  అంటే అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భాషలతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.  వరుస సినిమాల ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉంది. కనీసం  తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా గడిపేందుకు కూడా టైం దొరకడం లేదని తన సినీ లైఫ్ గురించి ఇటీవల చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు చిక్కులు తెచ్చిపెట్టాయి. తన సామాజికవర్గం నుంచే విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. 

తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..  వినోదభరితమైన సినీ ఇండస్ట్రీలోకి 'కొడవ జాతి నుంచి వచ్చిన మొదటి నటిని నేనే' అని రష్మిక పేర్కొంది. దీంతో ఆమె వ్యాఖ్యలు  కొడవ ప్రజలలో  తీవ్ర చర్చకు దారితీసింది.  ఆ కమ్యూనిటీకి చెందిన పలువురు కళాకారులు , నటీనటులు రష్మికపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆమె వాదనను తీవ్రంగా ఖండించారు.  ఒక్కసారి గతం కూడా తెలుసుకోవాలని హితవు పలికారు. రష్మిక పేరు వినిపించకముందే చాలా మంది నటీనటులు వెండితెరపై అలరించారని గుర్తు చేశారు. 

రష్మిక వ్యాఖ్యలపై సీనియర్ నటి నెరవంద ప్రేమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినీ ఇండస్ల్రీలో తమదైన ముద్ర వేసిన కళాకారుల గురించి కొడవ ప్రజలకు నిజం తెలుసని పేర్కొన్నారు.  1990 నుంచే అనేక మంది కళాకారులు కొడవ సామాజిక వర్గం నుంచి వచ్చారని గుర్తు చేశారు. రష్మిక పేరు వినపించముందే తాము చిత్ర పరిశ్రమలో ఉన్నామని  చెప్పుకొచ్చారు.  శశికళ నాకంటే ముందు నుంచి సహాయ పాత్రలో నటించారని పేర్కొన్నారు.  కన్నడ , తెలుగు, తమిళం, మళయాళం చిత్రాల్లో తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ప్రేమ మెప్పించారు. ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను సహితం గెలుచుకున్నారు.  

ALSO READ : అర్చిత ఫుకాన్ ఎవరు? కెండ్రా లస్ట్ 'డీల్'తో చరిత్ర సృష్టిస్తుందా?

మరో వైపు  రష్మిక వ్యాఖ్యలను  సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మరి కొందరు కొట్టిపారేశారు.  నటి నిధి సుబ్బయ్య మాట్లాడుతూ.. ఆమె చెప్పినంత మాత్రాన అది నిజం కాదు.. ఆ మాటలను పట్టించుకోవద్దని చెప్పారు. రష్మిక ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో తెలియదు.. ఆమెనే వివరణ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. మరి రష్మిక వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో, ఈ వివాదంపై ఆమె ఎలా స్పందిస్తుందో అనేది కొడవ ప్రజలతో పాటు సినీ వర్గాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఆమె వివరణ ఈ వివాదానికి ముగింపు పలుకుతుందేమో వేచి చూడాలి..