- వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే
- గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కేసులు నమోదు కాలేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం ఎబోలా వైరస్ నివారణ, ముందస్తు జాగ్రత్తలపై వైద్యాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను శంషాబాద్ లోని ఎయిర్పోర్టులో స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. గాంధీ హాస్పిటల్ లో 10 బెడ్లతో స్పెషల్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ, డాక్టర్ సునీల్ కుమార్ ను నోడల్ ఆఫీసర్ గా నియమించామని తెలిపారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను 21 రోజులపాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంచుతున్నట్లు వివరించారు.
ఈనెల 25 వరకు 58 మంది ప్రయాణికులు ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చారని, వారిని 21 రోజుల హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్న ప్రయాణికులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు అధికారులు, నిఘా బృందాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
