- కొత్త సెక్రటేరియెట్‌లోకి మీడియాకు నో ఎంట్రీ
- ప్రారంభోత్సవం రోజే సర్కార్ ఆంక్షలు
- కొన్ని సంస్థల ప్రతినిధులకే పాసులు
- మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు.. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ క్లోజ్
హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్‌లోకి మీడియా ప్రతినిధులు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ప్రారంభోత్సవం రోజే మీడియాకు అనుమతి నిరాకరించింది. ప్రజల సొమ్ముతో నిర్మించిన సెక్రటేరియెట్ ప్రారంభోత్సవాన్ని తమ ఇంటి వేడుకగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. మీడియా ఆ దరిదాపుల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాత సెక్రటేరియెట్నుంచి మీడియాను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. 2015లో సెక్రటేరియెట్‌లోకి మీడియాకు అనుమతి నిరాకరిస్తూ సర్క్యులర్ ఇచ్చారు.
దానిపై మీడియా ప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు మండిపడడంతో వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత పాత సెక్రటేరియెట్ కూల్చేసి, బీఆర్కే భవన్‌లోకి ఆఫీసులను షిఫ్ట్చేశాక మీడియాకు అనుమతి లేకుండా కఠిన ఆంక్షలు విధించారు. అక్కడ స్థలం తక్కువ ఉందంటూ ఇన్ని రోజులు తప్పించుకుంటూ వస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త సెక్రటేరియెట్ కట్టినా మీడియా ప్రతినిధులు లోపలికి రాకుండా ఆంక్షలు తీసుకొచ్చింది.
కొన్ని మీడియా సంస్థలకే పాసులు..
సెక్రటేరియెట్ప్రారంభోత్సవం కవరేజీలోనూ రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతం ప్రదర్శించింది. కేవలం కొన్ని ఎంపిక చేసినమీడియా సంస్థలకే పాసులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రధాన మీడియా సంస్థలుగా ఉన్న వీ6 చానల్, వెలుగు పేపర్ సహా అనేక మీడియా సంస్థలకు అనుమతి నిరాకరించింది. ప్రగతి భవన్పెద్దలు ఎంపిక చేసిన జాబితాలోని సంస్థల ప్రతినిధులకే ఐ అండ్పీఆర్అధికారులు పాసులు జారీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్స్ఫూర్తితో ప్రజలంతా సమానమని చెప్పేందుకే సెక్రటేరియెట్‌కు ఆ మహనీయుని పేరు పెట్టామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. రాజ్యాంగం స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ సెక్రటేరియట్‌లోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. ప్రారంభోత్సవం కవరేజీకి కొన్ని సంస్థలకు మాత్రమే అవకాశం ఇచ్చి ‘ఫ్రీడం ఆఫ్స్పీచ్’కు, పత్రికా స్వేచ్ఛకు తూట్లు పొడిచారు.
ఉదయం సుదర్శన యాగం..
కొత్త సెక్రటేరియెట్‌ను ఆదివారం సీఎం కేసీఆర్ప్రారంభించనున్నారు. ఉదయం 6 గంటల తర్వాత సెక్రటేరియెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్థలంలో సుదర్శన యాగం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:20 నుంచి 1:30 గంటల మధ్య యాగం పూర్ణాహుతి పూర్తిచేస్తారు. ఆ వెంటనే కేసీఆర్ సెక్రటేరియెట్‌ను ప్రారంభిస్తారు. నేరుగా ఆరో అంతస్తులోని తన చాంబర్లోకి వెళ్లి కూర్చుంటారు. మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య తమ చాంబర్లలో మంత్రులు, ఉన్నతాధికారులు కూర్చుంటారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఏదో ఒక ఫైల్‌పై సంతకం చేస్తారు. దళితబంధు, ఇండ్ల స్థలాల పంపిణీ, డైట్ చార్జీల పెంపు, రైతులకు పంట నష్ట పరిహారం తదితర వాటిల్లో ఏదో ఒక దానిపై కేసీఆర్ సంతకం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు సెక్రటేరియెట్ ఎంప్లాయీస్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఫైల్ పై తొలి సంతకం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇకపై మూడో ఫ్లోర్‌లోని తన ఆఫీసు నుంచి విధులు నిర్వర్తించనున్నట్లు పేర్కొన్నారు.
పార్కులన్నీ బంద్..
కొత్త సెక్రటేరియెట్ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ పేర్కొం ది. జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షోలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 8 వరకు హుస్సేన్ సాగర్, సైఫాబాద్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ సుధీర్ తెలిపారు.
అద్భుత కట్టడం: కేసీఆర్
ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడింపజేసేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అత్యద్భుతంగా సెక్రటేరియెట్‌ను నిర్మించామని కేసీఆర్ తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘అనేక అపోహలు, విమర్శలు, అడ్డంకులను దాటుకొని కొత్త సెక్రటేరియెట్ ప్రజలకు అందుబాటులో వస్తోంది. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక టెక్నాలజీతో సెక్రటేరియెట్ నిర్మించాం. ఇది దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల అద్భుత కట్టడం” అని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు దక్కాలనే లక్ష్యంతో సెక్రటేరియెట్ కు అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. కాగా, కొత్త సెక్రటేరియెట్ కు అంబేద్కర్ పేరు పెట్టినందుకు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ది ప్రాక్టీసింగ్ బుద్దిస్ట్ సొసైటీ (బౌద్ధ ఉపాసక్ మహాసభ) కేసీఆర్ కు అభినందనలు తెలిపింది. ఈ మేరకు లక్నో నుంచి సొసైటీ ప్రధాన కార్యదర్శి కేఆర్ రావత్ సీఎంకు లేఖ పంపించారు.