
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినోళ్లకు ఫైన్లు వేయబోమని ప్రకటించింది. వారం రోజుల పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. ఆఫర్ బాగుంది కదా అని రూల్స్ బ్రేక్ చేయొద్దని ఆయన ప్రజలను కోరారు. ట్రాఫిక్ రూల్స్‌పై జనంలో అవగాహన కల్పించడం, తమకు తాముగా రూల్స్ పాటించేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ వారం రోజులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు పువ్వు ఇచ్చి, ఇంకోసారి రూల్స్ అతిక్రమించొద్దని రెక్వెస్ట్ చేస్తారని చెప్పారు.
సీఎం భూపేంద్ర పాటిల్ తీసుకున్న మరో ప్రజానుకూల నిర్ణయమంటూ హర్ష్ సంఘవి ట్వీట్ చేశారు. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై నెటిజన్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ స్వాగతిస్తుండగా.. మరికొంతమంది నెటిజన్లు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ మొత్తంలో ఫైన్లు వేస్తున్నా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తుంటే.. ఆ ఫైన్లు కూడా వేయకుంటే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం రోజుల్లో ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతుందని ఇంకొంతమంది అంటున్నారు.