- రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం శాఖ సెక్రటరీ నీరజ్ మిట్టల్ సూచన
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదని.. ఈ అంశంపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ సూచించారు. డిమాండ్, ప్రాంతీయ అవసరాల దృష్ట్యా తగిన నిల్వలను అందుబాటులో ఉంచి సమయానుకూలంగా పంపిణీ చేయాలని తెలిపారు. దేశవ్యాప్తంగా గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, సరఫరాపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులతో బుధవారం నీరజ్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు సీఎస్ కే రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గ్యాస్ నిల్వల్లో ఎటువంటి కొరత లేదని ఆయన స్పష్టం చేస్తూ.. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధిలోనే రీఫిల్ బుకింగ్ చేయాలనే నిబంధనలు యథాతధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మకుండా, భయంతో బుకింగ్ చేయవద్దని సూచించారు. ఎల్పీజీ నుంచి పైప్ ద్వారా వచ్చే సహజ వాయువు (పీఎన్జీ) వైపు మారడం గృహాలకు తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతమని తెలిపారు. ఈ మార్పును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రా ల ప్రభుత్వ కార్యదర్శులకు తమ తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లభ్యత, పంపిణీ విధానాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకే ప్రత్యేకం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కేంద్రాలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, జిల్లా పాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌తో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
