- డ్రమ్ములు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లొద్దు
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వల్లే క్యూలు
- 65 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, ఆందోళన చెందాల్సిన పనిలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో కూడా కొరత ఏర్పడే పరిస్థితి లేదన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ బంక్‌ల వద్ద పెద్ద సంఖ్యలో జనాలు క్యూలో ఉంటున్నారని, ఇలాంటి పుకార్లను జనం నమ్మొద్దని సూచించారు.
బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మీడియాతో ఉత్తమ్ చిట్ చాట్ చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత పెట్రోలియం (బీపీ), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ) వంటి ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో డిమాండ్‌కు మించి సరఫరా కొనసాగుతున్నదని, బుధవారం 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా, 17,898 కిలో లీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.
ఈ ఒక్క రోజే 652 కిలో లీటర్ల ఇంధనం అదనపు నిల్వ ఉందని వివరించారు. ఇది కాకుండా ఇప్పటికే 16 వేల కిలో లీటర్ల ఇంధనం నిల్వ ఉందని, మరో 1,200 అదనపు ట్యాంకర్లను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే గందరగోళంలో జనం పెద్దసంఖ్యలో కొనుగోలు చేయడంతో రోజువారీ డిమాండ్ ఒక్కసారిగా 25 శాతం పెరిగిందని తెలిపారు. అయినా రోజువారి సరఫరాలో సగటున పోల్చి చూసినా 22 శాతం అదనపు నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
క్యాన్లు, డ్రమ్ముల్లో తీసుకెళ్లొద్దు..
రాష్ట్రంలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నా.. కొరత ఉందనే పుకార్లతో జనం క్యాన్లలో, డ్రమ్ముల్లో తీసుకెళ్తున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఇంధనాన్ని ఇలా తీసుకెళ్లడం చట్టవ్యతిరేకమని, అంతకు మించి ఇది అత్యంత ప్రమాదకమని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ క్యాన్లు, డ్రమ్ముల్లో పెట్రోల్పోయొద్దని బంకు యజమానులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. రానున్న 65 రోజులకు సరిపడా పెట్రోలియం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
హైదరాబాద్‌లో 596 పెట్రోల్ బంక్‌లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఏ బంక్‌లో కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. అలాగే, గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్పీజీ విషయంలో సైతం ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని కోరారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రమే కొంత సమస్య ఉందని చెప్పారు. అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు మంత్రి చెప్పారు.
ఇంధన నిల్వలు ఉన్నయ్: స్టీఫెన్ రవీంద్ర
రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ఆయిల్ కంపెనీలతో పెట్రోల్ బంక్‌ల యజమానులకు మధ్య ఉన్న క్రెడిట్ సమస్య కూడా పరిష్కారమైందని చెప్పారు. ఇంధన నిల్వలపై ఎప్పటికప్పుడు పెట్రోల్ బంక్‌లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
