
నిర్భయ దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. రేపు( ఫిబ్రవరి -1)న వారికి ఉరిశిక్ష విధించేందుకు తిహార్ జైలు సిబ్బంది రెడీ అవుతుండగా.. పటియాలా కోర్టు లేటెస్టుగా వారి ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి తీర్పు వచ్చే వరకు నిర్భయ దోషులను ఉరి తీయవద్దని తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇవాళ ఉదయం దోషుల తరపున లాయర్ పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ క్లైంట్స్ కు లీగల్ ఆప్షన్స్ ఇంకా ఉన్నాయని…అన్ని ప్రయత్నాలు చేసే వరకు ఉరిని ఆపాలని కోరారు. దీంతో కోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది.
గతంలో ఇదే కోర్టు జనవరి 22న నిర్భయ దోషులను ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ తర్వాత కనీసం 14 రోజుల గడువు ఉండాలన్న నిబంధన కారణంగా ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది కోర్టు. ఇప్పుడు మరోసారి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు రెండు సార్లు వాయిదా పడింది.