
కొలంబో: తనను ‘గో హోమ్’ అంటూ ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులకు శ్రీలంక కొత్త ప్రెసిడెంట్ రణిల్ విక్రమ సింఘే తగు జవాబిచ్చారు. ఇల్లే లేని వ్యక్తిని ఇంటికి పొమ్మంటే ఏడికి పోవాలని అడిగారు. సింఘే అధ్యక్ష భవనం ఖాళీ చేయాలని కొద్దిరోజులుగా ప్రజలు నిరసన తెలుపుతున్నారు. దీనిపై విక్రమ సింఘే సోమవారం స్పందించారు. అసలు వెళ్లడానికి తనకు ఇళ్లనేదే లేదని చెప్పారు.
కాల్చేసిన తన ఇంటిని మళ్లీ కట్టివ్వాలని లేదంటే దేశ పునర్నిర్మాణానికి కృషి చేయాలని ఆందోళనకారులకు ఆయన సూచించారు. కాగా, కిందటి నెలలో సింఘే ప్రధానిగా ఉన్నప్పుడు ఆందోళనకారులు ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లి తగలబెట్టారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో లంక కొత్త ప్రెసిడెంట్గా సింఘే అపాయింట్ అయ్యారు. అయినా, నిరసనకారులు సింఘేను ఉద్దేశించి.. అధ్యక్ష భవనం ఖాళీ చేయాలని, లేదంటే ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.