
రూ. 2 వేల నోట్ల మార్పిడి పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. నోట్ల మార్పిడికి ప్రజలు ఎవరూ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాల్సిన పని లేదని తెలిపింది. అంతేకాకుండా రిక్వెస్ట్ ఫామ్ నింపాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చింది. అర్బీఐ వెల్లడించిన రూల్స్ ప్రకారం ఒకే విడతలో గరిష్టంగా రూ. 20 వేల వరకు నోట్లను మార్చుకోవచ్చునని తెలిపింది.
రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటూ ఇటీవల ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న వేళ... బ్యాంకుల్లో నోట్ల మార్పిడి చేసుకోవాలంటే ఖాతాదారులు ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలతో పాటుగా ఒక ఫారమ్‌ను సమర్పించాలని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రకటన చేసింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023 మే 19 శుక్రవారం రోజున రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్‌లో ఉంచొద్దని బ్యాంక్‌లకు ఆదేశించింది. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
గత కొద్ది కాలంగా రూ. 2 వేల నోట్లు మార్కెట్లో సప్లై కావడం లేదు. రూ. 1000 స్థానంలో రూ. 2 వేల నోటును కేంద్రం తీసుకొచ్చింది. 2016లో పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి చెలామణిలో ఉన్న రూ. 2వేల నోట్లను.. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఉపసంహరించుకున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.