
నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూర్చొని మాట్లాడితే, ఆలమట్టి ప్రాజెక్టు సమస్య కొలిక్కివస్తుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్, బీజేపీ జిల్లా ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎలక్షన్టైంలో కర్నాటక నుంచి లారీల కొద్దీ డబ్బులు తెలంగాణకు పంపారని, దీనిపై కేసు కూడా నమోదైందన్నారు.
ఇప్పుడందుకు ప్రతిఫలంగా రాష్ట్ర ప్రయోజనాలు అమ్మేస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పెట్రోల్, డీజిల్ రేట్లు దేశంలోనే అధికంగా ఉండేవని, కేసీఆర్, కేటీఆర్ లూటీ చేశారని దుయ్యబట్టారు. ఇంధనం రేట్లు తగ్గించమని కేటీఆర్ ఇప్పుడు కోరడంలో అర్థం లేదన్నారు. బీజేపీ రాష్ట్రాల కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్ రూ.10 ఎక్కువగా ఉందన్నారు.
జీఎస్టీ తగ్గించడంతో ఖర్చు తగ్గి దేశప్రజలు సంతోషిస్తుండగా, ఆదాయం తగ్గిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏడ్వడం వింతగా ఉందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో కేంద్ర సర్కార్ రూ.2 లక్షల కోట్ల ఇన్కమ్ కోల్పోతుందన్నారు. ప్రజల సంతోషం కోసం ప్రధాని మోదీ జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఆమ్ఆద్మీ ట్యాక్స్‌తో ప్రధాని మోదీ జన్ కళ్యాణ్ చేశారని, 144 వందేభారత్ రైళ్లు, డిఫెన్స్, రైల్వే డెవలప్మెంట్, 80 కోట్ల మంది పేదలకు ఆహార భద్రత బియ్యం, ఐఐటీ, ఐఐఎం కాలేజీలు తెచ్చారన్నారు.
జీఎస్టీ తగ్గించినా జీడీపీ 0.8 శాతం నుంచి ఒక శాతం పెరుగనుందన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం తాము ఎదురుచూస్తున్నామని నిజామాబాద్ జిల్లా అంతా స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ స్టేట్ సెక్రటరీ స్రవంతిరెడ్డి ఉన్నారు.