ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తున్రు..జాబ్‍ సెక్యూరిటీ లేక చాలామందికి పెళ్లిళ్లు కావట్లే: మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తున్రు..జాబ్‍ సెక్యూరిటీ లేక చాలామందికి పెళ్లిళ్లు కావట్లే: మంత్రి  కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
  • అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
  • హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో ఉమ్మడి వరంగల్‍ జాబ్‍మేళా

వరంగల్‍, వెలుగు : ‘ఉద్యోగ భద్రత ఉంటేనే పెండ్లి చేసుకునేందుకు పిల్లని ఇస్తున్నరు, జాబ్‌‌ సెక్యూరిటీ లేకపోవడంతో పెళ్లి కాని వారి సంఖ్య పెరిగిపోతోంది’ అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో మెగా జాబ్‌‌ మేళా నిర్వహించారు. 

మంత్రి కొండా సురేఖ, వరంగల్‍ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍. నాగరాజు, వరంగల్‍ కలెక్టర్‍ సత్యశారద హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేవంత్‍రెడ్డి ప్రభుత్వం లక్ష ఉద్యోగాల హామీ ఇచ్చిందని.. ఇందులో ఇప్పటికే 65 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. వైఎస్‌‌ఆర్‌‌ హయంలో ఫీజు రియింబర్స్‌‌మెంట్‌‌ ద్వారా పేదలు, మహిళలకు ఉన్నత చదువులకు అవకాశం దొరికితే.. సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగాలు దొరుకుతున్నాయన్నారు. 

నిరుద్యోగ యువత కుటుంబానికి భారం కాకుండా.. ఓ వైపు ప్రైవేట్‍ జాబ్‍ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాలకు సమాయత్తం కావాలని సూచించారు. ప్రస్తుతం యువత మత్తు పదార్థాలకు బానిసలై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, వరంగల్‌‌లో సైతం గతంలో ఎన్నడూ చూడని దారుణాలు జరుగుతున్నాయన్నారు. రేస్‌‌ల పేరుతో ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే కాకుండా పక్కవారి ప్రాణాలు సైతం తీస్తున్నారన్నారు. 

జాబ్‍మేళాలో సుమారు 72 కంపెనీలు పాల్గొంటుండగా.. నాలుగు వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు దక్కనున్నట్లు వెల్లడించారు. స్థానిక ఉద్యోగాల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ... నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు, కొత్త కోర్సులు నేర్చుకుంటేనే భవిష్యత్‌‌ ఉంటుందన్నారు.