ఆపరేషన్ సిందూర్తో పాక్ మెడలు వంచినం.. యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడూ చెప్పలేదు: ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్తో పాక్ మెడలు వంచినం.. యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడూ చెప్పలేదు: ప్రధాని మోదీ
  • మనం కొట్టిన దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చింది: ప్రధాని మోదీ
  • జేడీ వాన్స్ ఫోన్ చేసి.. పాక్ భారీ దాడి చేస్తుందన్నారు
  • అదే జరిగితే ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పా 
  • ఆపరేషన్ సిందూర్​కు ప్రపంచమంతా మద్దతిచ్చింది
  • కాంగ్రెస్ మాత్రం మన వీర జవాన్లను సపోర్ట్ చేయలేదు
  • మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు, మిసైల్స్​తో సత్తా చాటినం
  • పాక్ మిలిటరీ స్థావరాలు ఇంకా ఐసీయూలోనే ఉన్నయ్ 
  • టెర్రర్ మాస్టర్​మైండ్లకు ఇప్పటికీ నిద్రలేని రాత్రులే 
  • ఆపరేషన్ సిందూర్​పై లోక్​సభలో చర్చకు సమాధానం

న్యూఢిల్లీ:  ఆపరేషన్ సిందూర్​తో మనం కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ వెంటనే కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంకా దాడులు చేస్తే తట్టుకోలేమని, యుద్ధం ఆపాలంటూ వేడుకున్నదని చెప్పారు. పాక్​పై యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడూ తమకు చెప్పలేదన్నారు. ప్రపంచమంతా ఆపరేషన్ సిందూర్​కు మద్దతిస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం మన వీర జవాన్లకు మద్దతు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్​పై లోక్​సభలో రెండు రోజుల చర్చకు ప్రధాని మంగళవారం 1.40 గంటలపాటు సమాధానం ఇచ్చారు.

టెర్రరిజంపై ఇండియా చేపట్టిన సైనిక చర్యను ఆపాలని ప్రపంచంలోని ఏ దేశం కూడా కోరలేదన్నారు. ఇండియా, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్నా.. అది అబద్ధమని ఎందుకు చెప్పడం లేదంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర అపొజిషన్ సభ్యులు చేసిన విమర్శలకు మోదీ ఈ మేరకు స్పందించారు. ‘‘మే 9వ తేదీ రాత్రి అమెరికా వైస్ ప్రెసిడెంట్ (జేడీ వాన్స్) మూడు నాలుగు సార్లు నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను సాయుధ బలగాల అధికారులతో మీటింగ్ లో బిజీగా ఉన్నా. మీటింగ్ తర్వాత నేను యూఎస్ వైస్ ప్రెసిడెంట్​కు ఫోన్ చేశా. పాకిస్తాన్ పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతోందని ఆయన హెచ్చరించారు. అయితే, పాక్ మాపై దాడి చేస్తే.. రెట్టింపు తీవ్రతతో మేం దాడి చేస్తామని చెప్పా. మేం బుల్లెట్లకు ఫిరంగి గుండ్లతో జవాబు చెప్తామన్నాను” అని మోదీ తెలిపారు.

పాక్ డీజీఎంవో ఫోన్ లో మొత్తుకున్నరు...  

ఇక దాడులు ఆపండి బాబోయ్.. అని పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీ (డీజీఎంవో) ఫోన్ లో మొత్తుకున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘‘గట్టిగా దెబ్బ కొట్టారు. ఇంకా దాడులు చేస్తే తట్టుకునే తాకత్ లేదు. యుద్ధం ఆపండి” అని పాక్  డీజీఎంవో ప్రాధేయపడ్డారని తెలిపారు. ‘‘మన ఆపరేషన్ ముగిసిన కొన్ని నిమిషాల తర్వాత మన టార్గెట్లు ధ్వంసం చేశామని పాక్ సైన్యానికి మన సైన్యం తెలియజేసింది. మనం 100 శాతం టార్గెట్లు సాధించాం. పాకిస్తాన్ మంచిగా ఆలోచించి ఉంటే అది టెర్రరిస్టుల పక్షాన నిలబడేది కాదు. కానీ సిగ్గు లేకుండా వాళ్లు టెర్రరిస్టుల పక్షాన నిలబడ్డారు. మేం కూడా వారి దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం” అని వివరించారు.

 ‘‘పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పెద్ద ఎత్తున స్పందిస్తుందని పాక్ ఊహించింది. అందుకే అణుబాంబుల పేరుతో బెదిరించారు. అయినా మే 6, 7వ తేదీన రాత్రి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం. పాక్ ఏమీ చేయలేకపోయింది. 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నాం. ఆపరేషన్ సిందూర్​తో 3 హెచ్చరికలు పంపాం. ఇండియాపై టెర్రర్ అటాక్ చేస్తే.. అంతకంటే తీవ్ర స్థాయిలో దాడి చేస్తామని, న్యూక్లియర్ బ్లాక్ మెయిల్​కు లొంగబోమని తేల్చిచెప్పాం. అలాగే టెర్రరిజానికి మద్దతిస్తే పాక్ ప్రభుత్వాన్ని, టెర్రరిస్టులను వేర్వేరుగా చూడబోమని కూడా హెచ్చరించాం” అని చెప్పారు. 

ఐసీయూలోనే పాక్ ఎయిర్ బేస్ లు.. 

ఇండియా దాడి చేసిన పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయని, ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి కుట్రపన్నిన సూత్రధారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘సిందూర్ నుంచి సింధూ వరకూ మనం చేపట్టిన ఆపరేషన్లను చూశాక.. ఏ దుస్సాహసం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న సంగతి పాకిస్తాన్ కు తెలిసొ చ్చింది. ఇంతకుముందు మన దేశంపైకి ఉగ్రమూకలను ఎగదోసిన సూత్రధారులు తమకు ఏమీ కాదని భరోసాతో ఉండేవారు. కానీ ఇప్పుడు ఉగ్రదాడులు జరిగితే వారిని వెతుక్కుంటూ ఇండియా వస్తుందని తెలిసిపోయింది” అని ప్రధాని అన్నారు. 

‘‘మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు, మిసైళ్లు మన సత్తాను చాటాయని, అదేసమయంలో పాక్ మిలిటరీ సామర్థ్యం ఏపాటిదో కూడా బయటపెట్టాయన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ సత్తా ఏమిటో ప్రపంచం చూసింది. కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి మరీ టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేసి వచ్చాం. ఇండియా దాడి చేస్తే.. పాక్ అణు దాడి చేస్తుందని కొందరు భయపెట్టారు. కానీ టెర్రరిస్ట్ స్థావరాలనే ధ్వంసం చేయడంతో వాళ్లు చోద్యం చూడక తప్పలేదు” అని ప్రధాని చెప్పారు. 

 పీవోకేను అప్పగించిందెవరు..? 

పాకిస్తాన్ పై యుద్ధం ఎందుకు ఆపారు? పీవోకేను తిరిగి ఎందుకు తీసుకురాలేదు? అని ప్రశ్నిస్తున్న వాళ్లు.. అసలు పీవోకేను ఎవరు అప్పగించారన్నది ముందుగా చెప్పాలని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలుకుని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తపపిదాల వల్ల ఇండియా నేటికీ బాధను అనుభవిస్తోందన్నారు. పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకుని, భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న నాడు.. పీవోకేను తిరిగి తీసుకునే అవకాశం ఉన్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వినియోగించుకోలేదన్నారు. 

తాము పాక్ నుంచి వస్తున్న వన్ వే ట్రాఫిక్ టెర్రరిజాన్ని అడ్డుకున్నామని చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ రిమోట్ కంట్రోల్ ద్వారా కాంగ్రెస్ నడుస్తోందని, అందుకే ఆపరేషన్ సిందూర్ ను ఆ పార్టీ యువ నేతలు ‘తమాషా’ అని పిలుస్తున్నారన్నారు. చివరకు ఆపరేషన్ మహదేవ్ లో భాగంగా సోమవారం పహల్గాం టెర్రరిస్టులను ఏరివేయడాన్ని కూడా.. కాంగ్రెస్ తప్పు పడుతోందన్నారు. ఇండియా ప్రయోజనాలను దెబ్బ తీస్తూ నెహ్రూ సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇది ఆయన చేసిన అతి పెద్ద తప్పిదమన్నారు. 

నెహ్రూ చేసిన ఈ తప్పిదాన్ని ఆ తర్వాతి ప్రభుత్వాలేవీ సరిదిద్దలేదని, కానీ రక్తం, నీళ్లు కలిసి పారలేవని తాము మాత్రమే తేల్చి చెప్పామన్నారు. పార్లమెంట్ లో కొందరు కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ మాట్లాడనివ్వడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ పై ఇండియా వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పినందుకే వారిని పార్టీ అగ్రనేతలు దూరం పెడుతుండవచ్చని అన్నారు. దేశం కోసం పనిచేసిన వారి పట్ల ఇలాంటి మనస్తత్వాన్ని చాటుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఆపరేషన్ సిందూర్ పై డిబేట్ లో కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, మనీశ్ తివారీలకు మాట్లాడేందుకు ఆ పార్టీ అవకాశం ఇవ్వకపోవడంపై ప్రదాని ఈ మేరకు పరోక్షంగా స్పందించారు.   

ప్రపంచ దేశాలన్నీ సపోర్ట్ చేశాయి.. కానీ కాంగ్రెస్ మద్దతియ్యలే..  

ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలు ఉంటే.. పాకిస్తాన్ కు కేవలం 3 దేశాలు మాత్రమే సపోర్ట్ చేశాయని, మిగతా దేశాలన్నీ ఇండియాకే మద్దతిచ్చాయని మోదీ తెలిపారు. ప్రపంచమంతా ఇండియాకు మద్దతిస్తే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం మన వీర జవాన్లను సపోర్ట్ చేయలేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. ‘‘పాకిస్తాన్ చేస్తున్న ప్రోపగండాకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నాయకులు దురదృష్టవశాత్తూ అధికార ప్రతినిధులుగా మారారు. నేడు ఇండియా సెల్ఫ్​రిలయంట్ గా మారుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం సమస్యల కోసం పాకిస్తాన్ పై ఆధారపడుతోంది. 

పాకిస్తాన్ కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇవ్వడం చూసి యావత్తు దేశమంతా విస్మయం చెందింది.  ఇప్పుడు పాకిస్తాన్ లోని టెర్రరిస్టులు, వారి బాస్ లు, మద్దతుదారులు ఏడుస్తున్నారు. విచిత్రంగా వారి ఏడుపులు చూసి ఇక్కడ మన దేశంలోనూ కొందరు చింతిస్తున్నారు” అని ప్రధాని ఎద్దేవా చేశారు. మన సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలను పూర్తిగా విశ్వసించి, పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని.. అందుకే టెర్రరిజం సూత్రధారులు ఇంకా నిద్ర లేని రాత్రులు గడిపేలా మన సాయుధ బలగాలు వారికి గుణపాఠం చెప్పివచ్చాయన్నారు. 

సిందూర్ నుంచి సింధూ వరకూ మనం చేపట్టిన ఆపరేషన్లను చూశాక.. ఏ దుస్సాహసం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న సంగతి పాకిస్తాన్​కు తెలిసొచ్చింది. ఇంతకుముందు మన దేశంపైకి ఉగ్రమూకలను ఎగదోసిన సూత్రధారులు తమకు ఏమీ కాదని భరోసాతో ఉండేవారు. కానీ ఇప్పుడు ఉగ్రదాడులు జరిగితే వారిని వెతుక్కుంటూ ఇండియా వస్తుందని తెలిసిపోయింది.
- ప్రధాని మోదీ