
బెంగళూరు: మహిళలకు ఫ్రీ బస్‌జర్నీ కల్పించడంతో మెట్రో రైలు ఆదాయానికి ఎలాంటి నష్టం లేదని కర్నాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. కర్నాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నప్పటికీ.. గడిచిన ఏడాది కాలంలో మెట్రో రైల్ రైడర్‌షిప్ 30% పెరిగిందని ఆయన చెప్పారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల మెట్రో ఆదాయం తగ్గుతుందని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బుధవారం మంత్రి స్పందించారు.
జూన్ 11, 2023న కర్నాటకలో ‘శక్తి పథకం’ ప్రారంభించామని, అప్పటి నుంచి ఈ నెల 20 వరకు 67.34 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారని పేర్కొన్నారు. జనవరి 2023లో మెట్రో రైలులో 1.65 కోట్ల మంది ప్రయాణించగా.. రూ.39.15 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఏప్రిల్ 2024లో ఆ ప్రయాణికుల సంఖ్య రెండు కోట్లకు పెరిగిందని, ఆదాయం రూ.51.71 కోట్లకు చేరిందని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 2023తో పోలిస్తే 2024లో నెలకు 35 లక్షల మంది ప్రయాణికులు పెరిగారని, ఆదాయం రూ.1.10 కోట్లు పెరిగిందని చెప్పారు.