బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఈబీసీలకు హక్కులు కల్పిస్తం: రాహుల్ గాంధీ

బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఈబీసీలకు హక్కులు కల్పిస్తం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: అత్యంత వెనుకబడిన తరగతుల(ఎక్స్ ట్రీమ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్–ఈబీసీ)కు తాము పూర్తి హక్కులు కల్పిస్తామని.. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గబోమని కాంగ్రెస్​ నేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఈబీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్​ తెస్తామని బుధవారం బిహార్​లో ‘అతి పిఛ్​డా న్యాయ సంకల్ప్’ సమావేశంలో ప్రకటించిన ఆయన.. ఇదే అంశంపై గురువారం ‘ఎక్స్​’ వేదికగా ట్వీట్​ చేశారు. బిహార్‎లో మహాఘట్​బంధన్ కూటమి అధికారంలోకి వస్తే చట్టాన్ని తేవడం ఖాయమని తెలిపారు.   

బిహార్‎లో అత్యంత వెనుబడిన తరగతులను బలోపేతం చేయడానికి ‘అతి పిఛ్​డా న్యాయ సంకల్ప్​ పత్రం’ తీసుకువచ్చామని.. దాన్ని అమలు చేసి తీరుతామని రాహుల్​ పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు సగం సీట్లు దక్కేలా చూస్తామని తెలిపారు. ఇది కేవలం విద్య కోసం కాదని.. వారి ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం తాము చేస్తున్న ప్రయత్నమని వివరించారు. 

బిహార్‎లో ఈబీసీలు 36 శాతం వరకూ ఉన్నారని.. వారి హక్కులను కాపాడటం, వారికి మరిన్ని హక్కులు కల్పించడానికి తమ కూటమి కట్టుబడి ఉందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కాగా, మహారాష్ట్రలో వరద బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్​ నేతలకు రాహుల్​ గాంధీ పిలుపునిచ్చారు. 

‘‘మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల వల్ల జన జీవనం స్తంభించిపోయింది. ఎందరో రోడ్డునపడ్డారని, పలువురు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. బాధిత కుటుంబాలను మహారాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కాంగ్రెస్​ శ్రేణులు కూడా సహాయ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని కోరుతున్న” అని ఆయన ట్వీట్​ చేశారు.