ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదు : మంత్రి గంగుల

ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదు : మంత్రి గంగుల

ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర్ రాంనగర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల కమలాకర్.. దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదని చెప్పారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం పంపకపోవడమేనా బీజేపీ సంస్కృతి అని విమర్శించారు. జీఎస్టీ మేము కడితే ఫలాలు మాత్రం గుజరాత్ కా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని రామగుండంలో కొత్తగా ఏమైనా కర్మాగారాలు ప్రకటిస్తారని అనుకుంటే కేవలం రాజకీయాలే మాట్లాడారని ఆరోపించారు.

ఢిల్లీ పాలకులకు తెలంగాణపై వివక్ష ఎందుకు? అని గంగుల మండిపడ్డారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి తిరిగి చుక్కెదురు కాక తప్పదని జోస్యం చెప్పారు. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, సంపద అందరికీ పంచాలన్నారు. ఆంధ్ర పార్టీలు తెలంగాణకు అవసరమా? అన్న గంగుల.. పాదయాత్రలతో కొందరు, కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు మరికొందరు తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు. సమైక్య పాలన ఇదివరకే చూశామని, మళ్ళీ మీ పాలన అవసరం లేదని స్పష్టం చేశారు.